తప్పు చేసినోళ్లకు చుక్కలుచూపిస్తాం: చంద్రబాబు

తెదేపాను ఇబ్బంది పెట్టేవారు భవిష్యత్తులో 10 రెట్లు ఎక్కువ ఇబ్బంది పడక తప్పదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. తప్పుచేసిన

Updated : 10 Jul 2021 16:38 IST

అమరావతి: తెదేపాను ఇబ్బంది పెట్టేవారు భవిష్యత్తులో 10 రెట్లు ఎక్కువ ఇబ్బందిపడక తప్పదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. తప్పుచేసిన వాళ్లకు చుక్కలు చూపిస్తామన్నారు. నాయకులు కేసులకు భయపడొద్దని సూచించిన చంద్రబాబు.. ధైర్యంగా పోరాడే వాళ్లకే భవిష్యత్తులో పదవులని తేల్చిచెప్పారు. జగన్‌ పాలనంతా అబద్ధాల అంకెల పైనే నడుస్తోందని.. వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహానాడు వేదికగా శ్రేణులకు బోధించారు. మహానాడులో రెండో రోజు రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీరు సహా పలు తీర్మానాలపై చర్చ జరిగింది. రాష్ట్రానికి ఒక కన్ను అయిన అమరావతిని పొడిచేసిన జగన్‌.. రెండో కన్నుగా ఉన్న పోలవరానికీ అదేగతి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. రైతు ప్రభుత్వమని చెప్పుకొంటూ వారి కళ్లకు గంతలు కడుతున్నారని మండిపడ్డారు. 

‘‘సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారు. గత ప్రభుత్వ పథకాలను కొత్తవిగా చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వానిది మోసకారి సంక్షేమం.. నకిలీ నవరత్నాలు. క్షేత్రస్థాయిలో చర్చలు పెడితే ప్రభుత్వ మోసం తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని ఒకే కంపెనీకి అప్పగించారు. గతేడాది రాష్ట్రంలో మిగులు సౌర విద్యుత్ ఉందన్నారు. 10వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ కోసం టెండర్లు పిలిచారు. ప్రజలపై అదనంగా రూ.2.5లక్షల కోట్ల భారం వేశారు. ధరలు, పన్నులు పెంచారు.. అప్పులు తెచ్చి ఏం చేశారు? ఎక్కడికక్కడ దోచుకొనే కార్యక్రమాలు చేశారు. ప్రజల ముందు ఈ ప్రభుత్వం దోషిగా నిలబడే రోజు త్వరలోనే వస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు.

మరోవైపు, సాగు రంగంపై మహానాడులో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీర్మానం చేశారు. సాగు రంగానికి చేసే ఖర్చుపై ప్రభుత్వానికి స్పష్టతలేదన్నారు. 65లక్షల గాను 45లక్షల రైతు కుటుంబాలకే రైతు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. అర్హత కలిగిన రైతులకు సున్నా వడ్డీ పథకం ఇవ్వలేదని, ప్రభుత్వ చర్యలతో పంటల దిగుబడి తగ్గిపోయే పరిస్థితి నెలకొంటోందని చెప్పారు. కరోనా, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts