ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం ఏపీకే అవమానం : చంద్రబాబు

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

Updated : 22 Apr 2022 14:48 IST

విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

‘‘ఇది చాలా దుర్మార్గపు ఘటన. ఆస్పత్రికి తీసుకొచ్చి బంధిస్తారా? రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైంది. ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం ఏపీకే అవమానం. 30 గంటలపాటు యువతిని బంధించారు. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా..? అని సీఎంను ప్రశ్నిస్తున్నా. సీఎం ఒంగోలుకు కాదు వెళ్లాల్సింది.. ఇక్కడికి రావాలి. మోసపూరిత సున్నా వడ్డీ కోసం సీఎం ప్రకాశం జిల్లా వెళ్లారు. ఆడబిడ్డల విలువ ఈ ప్రభుత్వానికి తెలియదు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు. ప్రభుత్వానిది అహంకారమా? ఉన్మాదమా?. ప్రజలు తిరగబడితే పారిపోతారు. సీఎం తన చెంచాలతో మాట్లాడిస్తే భయపడం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మనల్ని మనం కాపాడుకునేందుకు పోరాటం చేయాలి’’ అని చంద్రబాబు అన్నారు.

ఆ ముగ్గురికి ఉరిశిక్ష వేయాలి..

‘‘ఈ ఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో.. నేను సిగ్గుపడుతున్నా. బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోగా.. కుమార్తెను వెతుక్కోవాలని తండ్రికి చెప్పారు. అత్యాచారం చేసిన ముగ్గురికి ఉరిశిక్ష వేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

తెదేపా తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం

‘‘బాధితురాలు గౌరవప్రదంగా బతికేందుకు అండగా ఉందాం. తెదేపా నుంచి రూ.5 లక్షలు ఆర్థికసాయం ఇస్తున్నాం. బాధితురాలి వద్దకు ముఖ్యమంత్రి రావాలి. బాధితురాలికి రూ.కోటి, ఇల్లు, ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి’’ అని చంద్రబాబు కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని