Chandrababu: పొలిటికల్‌ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తాం : చంద్రబాబు

మెడపై కత్తి పెట్టి ఆస్తులు లాక్కుంటుంటే రాష్ట్రానికి పెట్టుబడులెలా వస్తాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. జగన్‌ అరాచకాల నుంచి వైకాపా నేతల్ని కూడా తామే రక్షించాల్సి వస్తోందని విమర్శించారు.

Updated : 04 Mar 2023 17:37 IST

అమరావతి: సీఎం జగన్‌ (CM Jagan) అరాచకాల నుంచి వైకాపా నేతల్ని కూడా తామే కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఎంపీ రఘురామ రాజు (Raghurama Raju), సుబ్బారావు గుప్తాలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ఎవరు ప్రశ్నించినా అక్రమకేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అక్రమకేసులు బనాయించే పోలీసులను ఉపేక్షించేది లేదని, చేసిన తప్పులకు వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. రాష్ట్రంలో రావణ కాష్టం తరహా పరిస్థితులు నెలకొంటే.. తెదేపా లీగల్‌ సెల్‌ అందుకు దీటుగా పని చేస్తోందని పేర్కొన్నారు. వైకాపా అరాచకాల దెబ్బకు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదన్న చంద్రబాబు.. ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు చేసే హక్కుందన్నట్లు డీజీపీ స్థాయి అధికారులే మాట్లాడే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని చంద్రబాబు ధ్వజమెత్తారు. విజయవాడ ఎన్టీఆర్‌ భవన్‌ సమీపంలోని సీకే కన్వెన్షన్‌ హాల్‌లో చంద్రబాబు అధ్యక్షతన తెదేపా లీగల్‌ సెల్‌ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. నాలుగేళ్లలో తెలుగుదేశం శ్రేణులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై చర్చించారు. నారాలోకేశ్‌ యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులపై సమావేశంలో చర్చ జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా న్యాయవిభాగం అనుసరించాల్సిన విధానాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైకాపా నేతలు విశాఖలో రూ.40 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మెడపై కత్తిపెట్టి ఆస్తులు లాక్కుంటుంటే పెట్టుబడులెలా వస్తాయని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులు, పోలీసులను వదలబోమని హెచ్చరించారు. పొలిటికల్‌ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తామని అన్నారు.

విశాఖ నుంచే పాలన సాగిస్తానంటూ  సీఎం  జగన్‌ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణగా పరిగణించవచ్చన్న న్యాయవాదులు.. కోర్టులో కేసు వేయాలని చంద్రబాబును కోరారు. సుప్రీం కోర్టులో ఉన్న రాజధాని అంశంపై మాట్లాడటం తప్పేనని చెప్పిన చంద్రబాబు.. ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో త్వరలో సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశముందని చెప్పారు.  జగన్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని