Chandrababu: ‘మీరు ఎలాగూ మారరు.. ప్రజలే మిమ్మల్ని మార్చేస్తారు’: చంద్రబాబు

ఏదైనా మంచి పనికోసం  వెనకడుగు వేయకుండా పోరాడితే దాన్ని పట్టుదల అంటారు. కానీ, కసితో ఇళ్లు కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తే దాన్ని సైకోతత్వం అంటారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 05 Mar 2023 19:18 IST

అమరావతి: మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘ఏదైనా మంచి పనికోసం  వెనకడుగు వేయకుండా పోరాడితే దాన్ని పట్టుదల అంటారు. కానీ, కసితో ఇళ్లు కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తే దాన్ని సైకోతత్వం అంటార’ని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నో రోడ్లు అధ్వానంగా ఉంటే.. ఈ ప్రభుత్వానికి ఇప్పటం రోడ్డు మాత్రమే ఎందుకు కనిపిస్తోందని ప్రశ్నించారు. వైకాపా నాయకులు ఎలాగూ మారరని.. ప్రజలే వారిని మార్చేస్తారని ట్విటర్‌ వేదికగా చంద్రబాబు హెచ్చరించారు.

గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఇప్పటం గ్రామంలో శనివారం మరోసారి యంత్రాంగం ఇళ్ల కూల్చివేత పనులు చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. పెద్దఎత్తున పోలీసులను మోహరించి ఇతరులెవరూ ఊళ్లోకి రాకుండా అడ్డగించి మరీ ఇళ్ల ప్రహరీలు, ర్యాంపులు, పిట్టగోడలు, ఇనుప గేట్లను తొలగించడం విమర్శలకు కారణమైంది. ‘ఆటోలు సైతం రాని ఊళ్లో రహదారి విస్తరణ పనులు చేపట్టాలనుకోవడం ప్రభుత్వ కక్ష సాధింపు కాదా? మేం గతేడాది జనసేన ఆవిర్భావ సభకు పొలాలిచ్చిన పాపానికి ఇంతగా వేధిస్తారా?’ అంటూ బాధిత నివాసితులు, గ్రామస్థులు తొలగింపు పనులను అడ్డుకోవాలని ప్రయత్నించారు. పోలీసుల సహకారంతో మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ ప్రణాళికా విభాగం అధికారులు గతంలో నిర్దేశించిన మార్కింగ్‌ ప్రకారం ఇళ్ల ప్రహరీలు, పిట్టగోడలను పొక్లెయిన్‌లతో తొలగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని