Chandrababu: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30శాతం దొంగ ఓట్లే: చంద్రబాబు

పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యం ఓటు తెలుగుదేశానికి, రెండో ప్రాధాన్యం ఓటు పీడీఎఫ్‌కు వేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ఓటర్లను కోరారు.

Published : 10 Mar 2023 21:33 IST

అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా 30శాతం దొంగ ఓట్లు చేర్చిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. సమాజంలో చీడ పురుగులకు గుణపాఠం చెప్పకపోతే వివేకానందరెడ్డిని చంపినట్టుగా ఇంకా రెచ్చిపోతారని దుయ్యబట్టారు. వివేకాను చంపి ఎన్ని విన్యాసాలు చేస్తున్నారో అంతా చూస్తున్నామని విమర్శించారు. వివేకానందరెడ్డిని చంపి ఊరందరి మీద వేసి, తప్పించుకోవటానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధపడుతూ  చనిపోవడం కంటే, ఐక్యంగా పోరాడితే ఏమీ కాదనే విషయాన్ని పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లు గుర్తించాలన్నారు. వివేకా కేసులో కీలక విచారణ జరుగుతుంటే.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై తప్పుడు కేసులతో అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యం ఓటు తెలుగుదేశానికి, రెండో ప్రాధాన్యం ఓటు పీడీఎఫ్‌కు వేయాలని కోరారు. వైకాపాకు ఎలాంటి ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా పోటీలో లేకపోయినా మొదటి ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం ఓట్లను ఏపీటీఎఫ్‌, పీడీఎఫ్‌ అభ్యర్థులకు వేయాలన్నారు. తిరుపతిలో సుందరయ్య హౌసింగ్ కాలనీ 225 బూత్‌లో ఒకే ఇంటి చిరునామాలో 14బోగస్ ఓట్లున్నాయన్నారు. 223 పోలింగ్ బూత్‌లో 10వ తరగతి, ఇంటర్ చదివిన వాళ్లందరికీ ఓటు హక్కు ఇచ్చేశారని తెలిపారు. వైకాపా కార్యాలయం అడ్రస్‌తో 34ఓట్లు చేర్చారని మండిపడ్డారు. నిజమైన పట్టభద్రులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారో లేక నాశనం చేసుకుంటారో ఆలోచన చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని