
Chandrababu: ప్రెస్‌మీట్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు
అమరావతి: శాసనసభలో జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈరోజు సభలో ఏకంగా తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం జగన్ కూడా అవహేళనగా మాట్లాడారన్నారు.
‘‘నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు. నా రాజకీయ జీవితంలో ఏనాడూ ఇంత బాధ భరించలేదు. బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. ఈరోజు నా భార్యను కించపరిచేలా దూషించారు. ఆమె ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదు. అధికారంలో ఉన్నపుడు నేనెవరినీ కించపరచలేదు. నిండు గౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొబెట్టినా బాధ్యతగా భావించా.
ఆనాడు నా తల్లిని వైఎస్ అవమానించారు..
ఈ కౌరవ సభ.. గౌరవం లేని సభ. గతంలో వైఎస్ కూడా అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు. ఆనాడు వైఎస్ తప్పు ఒప్పుకొని నాకు క్షమాపణ చెప్పారు. జగన్ ప్రజల పాలిట భస్మాసురుడిగా మారారు. ఇవాళ్టి ఘటనలను ఏవిధంగా అభివర్ణించాలో అర్థం కాలేదు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి.. నాకు పదవులు అవసరం లేదు. నా రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుంది. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య ప్రోత్సహించారు. హుద్‌హుద్ సమయంలో విశాఖలో చాలా రోజులున్నా.
తిట్టలేక కాదు.. అది మా విధానం కాదు!
స్పీకర్ తమ్మినేని సీతారాం తన ప్రవర్తనపై కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడుతుండగానే నా మైక్ కట్ చేశారు. గతంలో తెదేపా ప్రభుత్వంలో తమ్మినేని మంత్రిగా పనిచేశారు. గౌరవంగా బతికేవాళ్లను కూడా కించపరుస్తున్నారు. 40 ఏళ్లు పనిచేసింది.. ఇలా అవమానపడటానికా? అని బాధపడుతున్నా. అవతలివారు బూతులు తిడుతున్నా.. సంయమనం పాటిస్తున్నా. నాకు బూతులు రాక.. తిట్టలేక కాదు.. అది మా విధానం కాదు.’’ అని చంద్రబాబు అన్నారు.