Chandrababu: తెగించి పోరాడకపోతే వైకాపా శ్రేణుల అకృత్యాలు చుట్టుముడతాయి: చంద్రబాబు

 తాము చెప్పిందే రాజ్యాంగమనే గర్వంతో విర్రవీగుతున్న వైకాపా నేతలను ప్రజాక్షేత్రంలో శిక్షించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated : 26 Nov 2022 14:23 IST

హైదరాబాద్‌: తాము చెప్పిందే రాజ్యాంగమనే గర్వంతో విర్రవీగుతున్న వైకాపా నేతలను ప్రజాక్షేత్రంలో శిక్షించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తెగించి పోరాడకపోతే వైకాపా శ్రేణుల అకృత్యాలు ప్రతి ఒక్కరి ఇంటినీ చుట్టుముడతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక పాలనపై ప్రజలందరూ ఏకమై రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని.. లేదంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి చంద్రబాబు నివాళులర్పించారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు.

‘‘రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రతిపక్ష పార్టీగా తెదేపా చేసే పోరాటానికి ప్రజలంతా కలిసి రావాలి. సీఎం జగన్‌ రెడ్డి లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని ముందే ఊహించి ఆంబేడ్కర్ రాజ్యాంగం రచించారు. ఏపీలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోంది. అధికారంలో ఉన్నామని, తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ విలువలను పాటించడం లేదు. రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కుతూ ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరిస్తూ నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై దాడులు చేస్తూ, వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నారు.

ప్రభుత్వ విధానాలకు సంబంధించి 42 నెలల్లో దాదాపు 330కుపైగా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడం ప్రజా వ్యతిరేక పాలనకు అద్దం పడుతోంది. వందల సంఖ్యలో కోర్టు ధిక్కార పిటిషన్లు గాడి తప్పిన పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షల కోట్ల అప్పులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్‌కు ఇది అత్యంత ప్రమాదకరమైన గొడ్డలిపెట్టు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి? ప్రజలంతా ఆలోచన చేయాలి’ అని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు