Amaravati: అంతిమ విజయం దక్కాలి  

రాష్ట్ర రాజధాని కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తోన్న మహిళలను బూటు కాళ్లతో తన్నించినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు ఎదురవుతున్నాయని..

Updated : 30 Apr 2021 16:01 IST

తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి: రాష్ట్ర రాజధాని కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తోన్న మహిళలను బూటు కాళ్లతో తన్నించినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు ఎదురవుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి ఉద్యమం 500 రోజులకు చేరుకున్న నేపథ్యంలో ఆయన ట్వీట్‌ చేశారు. 

‘‘ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం 500 రోజులకు చేరుకుంది. జగన్‌ తన పాలనతో తీసుకున్న తుగ్లక్‌ నిర్ణయానికి సుమారు 29వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తుంటే ఈ 500 రోజుల్లో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడలేదు. ఇలాంటి మూర్ఖపు పాలకుడిని చూడటం ఇదే మొదటిసారి. పాలకులు ఎంత నిర్దయగా ప్రవర్తిస్తున్నా.. ప్రజా రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు శాంతియుతంగా, నిరాటంకంగా తమ ఆందోళనను కొనసాగిస్తోన్న రైతులు, రైతు కూలీలు, మహిళలకు అంతిమ విజయం దక్కాలని ఆశిస్తున్నా’’ అని చంద్రబాబు తెలిపారు.

రైతుల త్యాగం నిరుపయోగం కాదు: లోకేశ్‌
రాజధాని రైతుల త్యాగం నిరుపయోగం కాదని.. అమరావతి శాశ్వతంగా ఉంటుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రజారాజధానిదే అంతిమ విజయమన్నారు. ప్రజలే ముందుకొచ్చి తమ భూముల్ని త్యాగం చేసి ప్రజారాజధాని అమరావతికి పునాదులు వేయడానికి దోహదపడ్డారని లోకేశ్‌ గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా 30వేలమంది అన్నదాతలు స్వచ్ఛందంగా ల్యాండ్‌పూలింగ్‌కి సహకరించడంతో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి విలసిల్లిందన్నారు. రాష్ట్రానికే సంపదలాంటి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అమరావతిని కొనసాగించి, అభివృద్ధి చేయాల్సిన జగన్‌ సర్వనాశనమే లక్ష్యంగా మూడు రాజధానుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టారని దుయ్యబట్టారు.

నాటి నుంచి ప్రజారాజధాని పరిరక్షణ కోసం నడుం బిగించిన రైతులు, మహిళలు సకల జనులూ శాంతియుతంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. అధికారం అండతో ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసినా ఒక్కరూ వెనక్కి తగ్గలేదని కొనియాడారు. ‘ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని’ అంటూ గొంతెత్తి నినదిస్తూనే వందలాది గుండెలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పరిరక్షణే లక్ష్యంగా 500 రోజులుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న అన్నదాతలు, మహిళలు, ఉద్యమకారులందరికీ లోకేశ్‌ ఉద్యమాభివందనాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని