Chandrababu: తప్పుడు పనులు చేయడంలో జగన్‌కు అవార్డు ఇవ్వాలి: చంద్రబాబు

తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడిని అక్రమంగా అరెస్టు చేశారని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జలవనరుల శాఖ ఈఈని బెదిరించి అయ్యన్నపై తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని ఆరోపించారు. 

Updated : 03 Nov 2022 17:06 IST

మంగళగిరి: తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడిని అక్రమంగా అరెస్టు చేశారని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇంటి వద్ద రెక్కీ చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. పవన్‌పై దాడులు చేద్దామనుకుంటున్నారా? అని నిలదీశారు. ప్రతిపక్ష నాయకులు ఎవరినీ బతకనివ్వరా? అందరినీ చంపేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘విశాఖలో భూ కబ్జాలపై పోరాడితే అరెస్టు చేస్తారా? కబ్జాలను ప్రశ్నించిన అయ్యన్నను అక్రమ అరెస్టు చేశారు. ఆయన అరెస్టు వైకాపా అరాచక పాలనకు పరాకాష్ఠ. తెల్లవారుజామున 3గంటలకు వెళ్లి అయ్యన్నను అరెస్టు చేస్తారా? తాగిన మైకంలో వచ్చి దుర్మార్గంగా అరెస్టు చేశారని కుటుంబసభ్యులు చెప్పారు. కనీసం చెప్పులు కూడా వేసుకోనీయకుండా లాక్కెళ్తారా? అయ్యన్న ఇంటికి అర్ధరాత్రి వెళ్లాల్సిన అవసరమేంటి? పోలీసులు తాగి గోడలు దూకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? కొంతమంది కళంకిత అధికారులు తప్పుడు విధానాలతో వెళ్తున్నారు. అలాంటి వారిని వదిలి పెట్టేదే లేదు. బాబాయిని హత్య చేయించినట్లుగా అయ్యన్నపాత్రుడు ఏమీ చేయలేదే? ధైర్యం ఉంటే జగన్‌ బాబాయిని హత్యచేసిన వారిని అరెస్టు చేయండి. వివేకా హత్యపై షర్మిల వాంగ్మూలం, రుషికొండ అంశం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికే అయ్యన్నను అరెస్టు చేయించారు. 

భూ దోపిడీ కుటుంబం నుంచి వచ్చిన చరిత్ర జగన్‌ది

జలవనరుల శాఖ ఈఈని బెదిరించి అయ్యన్నపై తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. వివేకా హత్యకేసులో సాక్ష్యాలు తారుమారుపై సీఐ శంకరయ్య సీబీఐకి తొలుత వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి పదోన్నతి పొందాక వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు. అయ్యన్నపై ఇచ్చిన ఫిర్యాదు కూడా ఇలాంటిదే. అయ్యన్న తాత నుంచి ఆ కుటుంబానికి మచ్చలేని 60ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. భూ దోపిడీ కుటుంబం నుంచి వచ్చిన చరిత్ర జగన్‌ది. ఇడుపులపాయలో వందల ఎకరాలు వైఎస్‌ కుటుంబం ఆక్రమించుకుంది. బంజారాహిల్స్‌లో ప్రభుత్వ స్థలం కబ్జా చేసి.. వైఎస్‌ సీఎం అయ్యాక క్రమబద్ధీకరించుకున్నారు. జగన్‌ మేనమామ వాగును ఆక్రమించి థియేటర్‌ కట్టుకున్నారు. ఇంతటి భూ దోపిడీ కుటుంబ నేపథ్యం నుంచి జగన్‌ వచ్చారు. 0.02 సెంట్ల భూమి ఆక్రమణ ఆరోపణలపై అయ్యన్నను అరెస్టు చేయించడం దుర్మార్గం. వైఎస్‌ కుటుంబం అక్రమాలపై ఫిర్యాదు చేస్తాం.. చర్యలు తీసుకుంటారా? హత్య చేసిన అవినాష్‌కు అభయం ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర కబ్జాలను ప్రశ్నించిన అయ్యన్నను అరెస్టు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కుతారా? తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తారా? మేం తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే లక్షలమందిపై పెట్టాల్సి వస్తుంది.  

అయ్యన్నపై రేప్‌ కేసు పెడతారా?

సీఐడీ ఆఫీస్‌ టార్చర్‌ ఆఫీస్‌గా మారింది. శారీరకంగా హింసిస్తారేమో.. మానసికంగా మేం బలంగా ఉన్నాం. నలుగురు మాజీ మంత్రులను అక్రమంగా అరెస్టు చేయిస్తారా? అయ్యన్నపై రేప్‌ కేసు పెడతారా? కోర్టులు చీవాట్లు పెట్టినా ఈ ప్రభుత్వానికి బుద్ధిరాలేదు. జగన్‌ లాగా ఎవరి అకౌంట్లకు డబ్బు రాలేదు. 24 మంది బీసీ నేతలను చంపేస్తారా? బీసీల్లో నాయకత్వం రావడం చాలా కష్టం. అయ్యన్న కుటుంబంపై 12 కేసులు పెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వమే చేస్తున్న టెర్రరిజం ఇది. తెదేపా నేతలపై కేసులు పెడుతున్న సీఐడీ అధికారుల చరిత్ర ఏంటి? ఎవరికి చెబుతారు కాకమ్మ కబుర్లు?  

వాంగ్మూలంలో షర్మిల స్పష్టంగా చెప్పినా చర్యల్లేవే?

వివేకా హత్యకేసులో షర్మిల సంచలన వాంగ్మూలం ఇచ్చారు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి చంపించారని సమాచారం ఉందని చెప్పారు. వాంగ్మూలంలో షర్మిల స్పష్టంగా చెప్పినా చర్యల్లేవే? కడప ఎంపీ టికెట్‌ విషయంలో వివాదాలు ఉన్నాయని ఆమె చెప్పారు. చెల్లెలు, తల్లికి టికెట్ ఇవ్వడం ఇష్టం లేకే ఘోరాలకు పాల్పడుతున్నారు. సీఐ శంకరయ్య వాంగ్మూలం ఇచ్చే సమయంలో బెదిరించారా? లేదా? తప్పుడు పనులు చేయడంలో జగన్‌కు అవార్డు ఇవ్వాలి. బెదిరించి బ్లాక్‌మెయిల్‌ చేసి కేసు పెట్టిస్తారా? తప్పుడు పనులు చేయడానికే సీఎం పదవిలో జగన్‌ ఉన్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని