Updated : 28 May 2022 20:10 IST

TDP mahanadu: జగన్‌ను ఇంటికి పంపాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు: చంద్రబాబు

ఒంగోలు: సీఎం జగన్‌ను త్వరగా ఇంటికి పంపాలనే ఉత్సాహం రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మహానాడు వేదికగా నిర్వహించిన తెదేపా బహిరంగ సభలో వైకాపా ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. అంచనాలకు మించి హాజరైన తెదేపా శ్రేణులను ఉద్దేశించి రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించారు.

ఈరోజు జగన్‌కు నిద్రరాదు..

‘‘క్విట్‌ జగన్‌ - సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని 5కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు ముందుకు వచ్చారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. ప్రజలు సభకు రాకుండా అడ్డుకోవాలని చూశారు. పోలీసులు వాహనాలను అడ్డుకోవడమే కాదు.. కారు టైర్లలో గాలి తీశారు. తెదేపా వెంట ప్రజలు ఉన్నారు.. వైకాపా వెంట బస్సులు ఉన్నాయి. అదుపు తప్పితే పోలీసులనూ నియంత్రించే శక్తి తెలుగు సైన్యానికి ఉంది. ప్రజలకోసం పోరాడుతాం. కొండనైనా బద్దలు కొట్టే శక్తి తెలుగుదేశం శ్రేణులది. ఈరోజు జగన్‌కు నిద్రరాదు. బస్సు యాత్ర పెడితే నమ్ముతారనుకున్నారు. బాదుడే బాదుడుకు పోటీగా గడప గడపకు ప్రభుత్వం అని నిర్వహించారు. గడప గడపకు వెళ్తే మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. వాళ్ల మీటింగ్‌లు వెల వెల.. మన మీటింగ్‌ కళ కళ’’ అని ఎద్దేవా చేశారు.

ఎక్కడ ఉన్నా వదిలిపెట్టం..

మన నాయకుడు ఎన్టీఆర్ ఆశయాలను నెమరువేసుకోవాలి. భవిష్యత్‌లో కూడా ఎన్టీఆర్‌ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరు. ఈ ఏడాదంతా పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టి ఆయన ఆశయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో మహానాడు పెడతాం. వైకాపా అవినీతిని ఎండగట్టేందుకు ముందుకెళ్తాం. సినిమాల్లో, రాజకీయాల్లో ఆయనతో పోటీపడేవారు లేరు. బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా ఆడకూడదని ఆంక్షలు పెట్టారు. అడ్డంకులు అధిగమించి అఖండ సూపర్‌ హిట్‌ అయింది. సినిమా వాళ్లను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. రేపు... నీ పేపర్‌, టీవీ, భారతి సిమెంట్‌కు నేనే పర్మిషన్‌ ఇవ్వాలి. ఎట్లా నడుపుతావ్‌. ‘బాదుడే బాదుడు’ ఈ నినాదం ప్రతి ఒక్కరికి చేరవేసే బాధ్యత తెదేపా కుటుంబ సభ్యులు తీసుకోవాలి. టమోటా రూ.120కు చేరింది. శ్రీలంక మాదిరిగా ఏపీ మారే పరిస్థితి వచ్చింది. రౌడీల గుండెల్లో నిద్రపోయిన పార్టీ తెదేపా. రాజకీయ నేరగాళ్లు వచ్చారు.. ఎక్కడ ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదు’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

మూడేళ్లలో జగన్‌ దోచుకున్నది రూ.1.75లక్షల కోట్లు..

‘‘వైకాపా ప్రభుత్వం రూ.8లక్షల కోట్లు అప్పు చేసింది. సంక్షేమ పథకాల పేరిట రూ.లక్షల కోట్లు దోచుకున్నారు. నిజమైన సంక్షేమం అంటే తెదేపా పథకాలే. రూ.8లక్షల కోట్ల అప్పును జగన్‌ చెల్లిస్తారా? క్వార్టర్‌ బాటిల్‌ ధర రూ.9 ఉండేది. కానీ ఈ ప్రభుత్వం రూ.21 చేసింది. ఇందులో రూ.12 జగన్‌ జేబులోకి వెళ్తున్నాయి. ప్రతి క్వార్టర్‌పై జగన్‌ వాటా రూ.12. జంగారెడ్డిగూడెంలో 22 మంది కల్తీ సారాకు బలయ్యారు. ఏ మద్యం షాపులో కూడా బిల్లు ఇవ్వడం లేదు, ఆన్‌లైన్‌ పేమెంట్‌ లేదు. లిక్కర్‌ ద్వారా ఏటా జగన్‌ ఆదాయం రూ.5వేల కోట్లు. జగన్‌ మోహన్‌ రెడ్డీ... నీ అవినీతి సొమ్మును కక్కిస్తా. బద్వేలులో 8వేల ఎకరాలు కబ్జా చేశారు. బెదిరించి అన్ని పరిశ్రమలను వైకాపా నేతలు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి పంచుకు తింటున్నారు. గూగుల్‌ మ్యాప్‌లు ఉన్నాయి.. అవినీతిని వెలికి తీస్తాం. అన్యాక్రాంతమైన భూమిని ప్రజలకు ఇప్పించే బాధ్యత నాది. జగన్‌ రెడ్డి మూడేళ్ల పాలనలో రూ.1.75లక్షల కోట్లు దోచుకున్నారు’’ అని చంద్రబాబు ఆరోపించారు.

సోషల్‌ మీడియా ద్వారా వైకాపా అరాచకాలు ఎండగట్టాలి..

‘‘సోషల్‌ మీడియా ద్వారా వైకాపా అరాచకాలను ఎండగట్టాలి. మీడియాను కూడా వైకాపా నేతలు బెదిరిస్తున్నారు. సంస్కరణలు తీసుకొచ్చి అందరి చేతిలో సెల్‌ఫోన్‌ ఉండేలా చేశా. సెల్‌ఫోన్‌ అయుధంగా సామాజిక ఉద్యమం చేపట్టాలి. జగన్‌ ప్రభుత్వానికి ఉరేసి బంగాళాఖాతంలో కలపాలి. నేను ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే.. జగన్‌ వాలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చారు. అందరికీ అమ్మ ఒడి ఇస్తానని చివరికి కండీషన్లు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తా. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసే పార్టీ తెదేపా. కరోనా కంటే, రాష్ట్ర విభజన కంటే జగన్‌ విధానాల వల్ల ప్రజలకు ఎక్కువ నష్టం జరిగింది. ఆంక్షలు పెట్టి జగన్‌ మీడియా వాళ్లను బెదిరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా వాళ్లకూ న్యాయం చేస్తా. 30లక్షల ఇళ్లు కట్టిస్తానని మూడేళ్లలో 3 ఇళ్లు కట్టారు. బాబాయిని చంపి గొడ్డలి పోటును గుండె పోటుగా నమ్మించిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడా?  కోడి కత్తి కేసు ఏమైంది?నీకు రోషం ఉంటే.. మీ బాబాయిని హత్య చేసిన వారిని అరెస్టు చేయాలి. రాజధానిగా అమరావతి ఉంటుందని ఎన్నికల ముందు జగన్‌ చెప్పారా? లేదా? వేల కోట్లు ఖర్చు చేసి అమరావతి నిర్మిస్తే.. దాన్ని నిర్వీర్యం చేశారు. అమరావతి పోవడం వల్ల రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైంది’’ అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.


 

ప్రత్యేక హోదా ఏమైంది?

‘‘ఎన్నికల ముందు చెప్పిన ప్రత్యేక హోదా ఏమైంది? రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని హోదా కోసం పోరాడాం. 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు పోయాయి.. కొత్తవి వస్తాయని కూడా నమ్మకం లేదు. జగన్‌ ఆదాయం పెరుగుతోంది... ప్రజల ఆదాయం తగ్గుతోంది. సామాజిక న్యాయానికి గొడ్డలి పెట్టు వైకాపా. జిల్లాల విభజనపై సమీక్ష చేసి అందరికీ న్యాయం చేస్తాం. వైకాపా అరాచకాలపై యుద్ధం ప్రకటించాం. వీరోచితంగా పోరాడండి. తాటాకు చప్పుళ్లకు భయపడం. మీలాంటి వాళ్లను చాలా మందిని చూశాం. జగన్‌ లాంటి వాళ్లు రాష్ట్రానికి అరిష్టం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత 5కోట్ల ప్రజలపై ఉంది. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనదే. ప్రజల్లోకి వెళ్లి వారిని చైతన్యపరిచి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రజలకు అండగా నిలవాలి. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి మిమ్మల్ని కాపాడుకుంటా’’ అని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని