నువ్వు సీఎంగా ఉండగా కేసు బదిలీ.. తలెక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ?: చంద్రబాబు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు.

Updated : 29 Nov 2022 13:23 IST

అమరావతి: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘సొంత బాబాయ్‌ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయింది. అది కూడా నువ్వు సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ?’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం పదవికి జగన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

బాబాయ్‌ వివేకాను చంపించింది అబ్బాయేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ‘‘బాబాయ్‌ హత్య కేసు పక్క రాష్ట్రానికి.. అబ్బాయ్‌ చంచల్‌గూడ జైలుకి’’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ బదిలీపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో సాక్షులను, నిందితులు బెదిరిస్తున్నారని.. విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె వైఎస్‌ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది. మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నట్లు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా పేర్కొన్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని