Chandrababu: జగన్‌ పాపాలు తేల్చాలంటే మరో కాగ్‌ కావాలేమో!

ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, అప్పులు, నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం లెక్కలు తేల్చాలంటే ఇప్పుడున్న కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వల్ల కూడా కాదని, కొత్త కాగ్‌ రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 10 Jul 2024 06:49 IST

పంచాయతీల నుంచి తీసుకున్న నిధుల్నీ డిస్కంలకు ఇవ్వలేదు
విషవలయంలో ఉన్నాం.. బయటపడేందుకు సమయం పడుతుంది
విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల వేళ చంద్రబాబు వ్యాఖ్యలు
ఈనాడు - అమరావతి 

విద్యుత్తుపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, అప్పులు, నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం లెక్కలు తేల్చాలంటే ఇప్పుడున్న కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వల్ల కూడా కాదని, కొత్త కాగ్‌ రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. విద్యుత్‌ రంగాన్ని జగన్‌ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కరెంటు బకాయిల సర్దుబాటు పేరుతో పంచాయతీల నుంచి తీసేసుకున్న నిధుల్లో విద్యుత్‌ సంస్థలకు కొంత మొత్తం ఇచ్చి, మిగతాది దారి మళ్లించారని మండిపడ్డారు. విద్యుత్‌రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. 

నా పవర్‌ పోయినా.. దేశం బాగుపడింది!

‘విద్యుత్‌ రంగంలో నేను తెచ్చిన సంస్కరణల వల్ల నా పవర్‌ పోయిందిగానీ.. దేశం బాగుపడింది’ అని చంద్రబాబు చమత్కరించారు. తాను ప్రవేశపెట్టిన విద్యుత్‌ సంస్కరణలపై విపక్షాలు తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేయడం వల్ల 2004 ఎన్నికల్లో అధికారం కోల్పోయామని తెలిపారు. జగన్‌ దుర్మార్గపు పాలనలో అస్తవ్యస్తమైన విద్యుత్‌ రంగాన్ని మళ్లీ గాడిన పెట్టడం చాలా పెద్దపనే అయినా, సవాల్‌గా తీసుకుంటామని తెలిపారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

గత ప్రభుత్వం వినియోగదారులపై వేసిన అదనపు ఛార్జీలను తొలగిస్తారా? 

మనం ఇప్పుడు విషవలయంలో ఉన్నాం. బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఆదాయం లేకపోతే బొగ్గు కూడా కొనలేని పరిస్థితి తలెత్తుతుంది. డిస్కంలకు హామీ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులెక్కడున్నాయి? అందుకే మొత్తం విద్యుత్‌ రంగాన్ని గాడిన పెట్టేందుకు వ్యూహం రూపొందిస్తాం. కోతలు, లోఓల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ ఇస్తాం. దానిలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. 

జగన్‌ ప్రభుత్వం పేదలపై వేసిన విద్యుత్‌ ఛార్జీల భారాన్ని తగ్గిస్తారా?

పేదలపై ఇప్పటికే భారం పడిపోయింది. కొత్త టారిఫ్‌లు వచ్చే మార్చికి అమల్లోకి వస్తాయి. అప్పటికి ఏం చేయాలో ఆలోచిస్తాం. ప్రభుత్వం ముందు చాలా సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులూ ఉన్నాయి. దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలిశాను. మన కష్టంతో ముందుకెళుతూనే, వారి సాయం కూడా తీసుకోవాలి. ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మొత్తం భారం వాళ్లనే తీసుకోమనలేం. వాళ్ల ఇబ్బందులు వాళ్లకుంటాయి. వాళ్లు 29 రాష్ట్రాల్ని సమన్వయం చేసుకోవాలి కదా. 

జగన్‌ ప్రభుత్వం విద్యుదుత్పత్తి సంస్థలకు ఎడాపెడా చేసిన భూకేటాయింపులు, సెకీ వంటి సంస్థలతో చేసుకున్న కొనుగోలు ఒప్పందాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?  

అన్నీ లోతుగా పరిశీలిస్తాం. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి చట్టాలు, కోర్టులు ఉన్నాయి. విచారణ చేసేస్తామనో, మరొకటి చేసేస్తామనో చెబితే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రారు. ఇప్పటికే పెట్టుబడిదారులు రాష్ట్రంలో ఒక భూతం ఉందని, ఇక్కడికి రావాలంటేనే భయపడుతున్నారు. దాన్ని శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తామని వారికి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం.

స్మార్ట్‌మీటర్లపై ఏం చేయబోతున్నారు? 

స్మార్ట్‌మీటర్లు ఎంత వరకు ఏర్పాటు చేశారు, ఒప్పందంలో ఏముంది? దానిపై ఎలా ముందుకెళ్లాలన్నది పరిశీలించి నిర్ణయిస్తాం. వ్యవసాయ విద్యుత్‌ మీటర్లు ఇప్పటికే ఏర్పాటైనచోట అవి వృథా కాకుండా, ప్రభుత్వ ఖర్చుతో సోలార్‌ ప్యానళ్లు అందజేసి, రైతులే విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునేలా చూస్తాం. మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి ఇస్తే.. రైతులకు డబ్బులు చెల్లించేలా చర్యలు చేపడతాం.

పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల పేరుతో జగన్‌ ప్రభుత్వం అడ్డగోలుగా భూములిచ్చింది. ఆ విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు ఇవ్వాలన్న నిబంధన కూడా పెట్టలేదు కదా?

పీఎస్‌పీ ప్రాజెక్టుల్లో ఉత్పత్తయిన విద్యుత్‌ బయటకు వెళ్లినా నష్టం లేదు. మన వినియోగదారులపై భారం పడకుండా ఉంటే చాలు. వాటి వల్ల పెద్దగా ఉపాధి లేకపోయినా, ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది. 

గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా ఏపీ 

రాబోయే రోజుల్లో రాష్ట్రం గ్రీన్‌ హైడ్రోజన్‌ విద్యుదుత్పత్తికి హబ్‌గా మారుతుంది. విశాఖలో ఎన్టీపీసీకి ఇచ్చిన భూమిలో.. గ్రీన్‌ హైడ్రోజన్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు అనుమతివ్వాలని ఆ సంస్థ కోరుతోంది. విశాఖలో ఇప్పటికే ఉన్న థర్మల్‌ ప్లాంట్‌ను కూడా గ్రీన్‌ థర్మల్‌ ప్లాంట్‌గా మారుస్తాం అంటోంది. రాబోయే రోజుల్లో ఇలాంటి వినూత్న మార్పులు చాలా వస్తాయి.  

బీపీసీఎల్‌ రిఫైనరీ వస్తుంది

రాష్ట్రంలో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్‌ సంస్థ ఆసక్తిగా ఉంది. అది మచిలీపట్నంలోనా, మరో చోటా అన్నది ఇంకా నిర్ణయించలేదు. 

నరేగా పనుల బిల్లుల చెల్లింపునకు కసరత్తు 

రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాలేదు. ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సినవాళ్లు రోజూ తిరుగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు నరేగా పనులు చేసిన వారికీ జగన్‌ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. వారికి ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం.

కమోడ్‌లు, ఏసీలు కూడా పనిచేయలేదు!

చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చే క్రమంలో.. లేజర్‌ లైట్‌ పాయింటర్‌తో తెరపై చూపిస్తుండగా పాయింటర్‌ పనిచేయడం మానేసింది. మరొకటి తీసుకోగా అది కూడా మొరాయించడంతో ఆయన అసహనానికి గురయ్యారు. ‘సిబ్బందిలో ఇంకా పాత వాసనలు పోలేదు. కనీసం సరైన పాయింటర్‌ కూడా ఇవ్వలేకపోయారు. అది పనిచేస్తుందో లేదో పరిశీలించడం వాళ్ల బాధ్యత కదా! గత ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి వీళ్లూ అన్నీ వదిలేశారు. నేను మళ్లీ ఇక్కడ అడుగుపెట్టేనాటికి ఏసీలు, కమోడ్‌లు పనిచేయలేదు. గదులు అధ్వానంగా ఉన్నాయి’  అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇసుక ఉచితంగా ఇస్తే.. వైకాపా వారికెందుకు నొప్పి?

ఎన్నికల ముందు తెదేపా ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెస్తే.. వైకాపా నాయకులకు కడుపునొప్పి మొదలైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఇసుకను ఇంటికి తీసుకెళ్లి ఉచితంగా అందజేస్తామని మేం చెప్పినట్లు వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నదులు, కాల్వల్లో ఇసుక ఉంటే.. ట్రాక్టర్లు, ఎడ్లబళ్లలో ఉచితంగా తీసుకెళ్లవచ్చని చెప్పాం. వైకాపా నాయకులూ వాళ్ల ఊళ్లలో ఎడ్లబళ్లు కట్టుకుని ఇసుక తీసుకెళ్లొచ్చు. ప్రస్తుతం 48 లక్షల టన్నుల ఇసుక సిద్ధంగా ఉంది. బోట్స్‌మెన్‌ సొసైటీల ద్వారా మరో 60-70 లక్షల టన్నులు అందుబాటులోకి తేవచ్చు’ అని చెప్పారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని