
AP Plotics : బుద్దా వెంకన్నఅరెస్టు.. పోలీసుల వైఖరి దుర్మార్గం : చంద్రబాబు
మంగళగిరి: తెదేపా నేత బుద్దా వెంకన్న అరెస్టును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందని అన్నారు. బుద్దాపై కేసు బనాయించడం కుట్రపూరితమని, అతడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కొడాలి క్యాసినోపై ప్రశ్నించిన తమ నేతలను అరెస్టు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడటం లేదు? దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్టు చేస్తారా?తప్పు చేసిన పోలీసులు విచారణ ఎదుర్కొనక తప్పదు.’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
పోలీసులు ప్రజా రక్షణ కోసమే పని చేస్తున్నారా ? : లోకేశ్
‘ఏపీలో పోలీసులు ప్రజా రక్షణ కోసమే పనిచేస్తున్నారా? లేదంటే వైకాపా నేతలకు కాపలా కాస్తున్నారా’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. బుద్దా వెంకన్న అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. నాని క్యాసినో నడిపినప్పుడు, గడ్డం గ్యాంగ్ ప్రతిపక్ష నేతని బూతులు తిట్టినప్పుడు పోలీసులు ఎక్కడున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘ గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు పోలీసులు లేరు. తెదేపా కేంద్ర కార్యాలయాన్ని వైకాపా మూకలు ధ్వంసం చేస్తే నో పోలీస్’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిని నిలదీస్తే.. పోలీసులు బిలబిలమంటూ వచ్చి వెంకన్నను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. క్యాసినో వ్యవహారంపై తెదేపా నేతలు ఫిర్యాదు చెయ్యడానికి వెళితే కనీసం అనుమతించని డీజీపీ.. ఐపీఎస్ ముసుగులో ఎన్నాళ్లిలా వైకాపా కోసం పనిచేస్తారని దుయ్యబట్టారు.