Chandrababu: ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపా చిత్తుగా ఓడిపోవడం ఖాయం: చంద్రబాబు

ప్రభుత్వ ఉద్యోగులకు 13వ తేదీ వచ్చినా జీతాలివ్వలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా రివర్స్‌ విధానాల వల్ల యావత్తు రాష్ట్రం ఇదేం ఖర్మ అని ఆవేదన చెందుతోందన్నారు.

Published : 14 Dec 2022 20:00 IST

అమరావతి: వైకాపా ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విషయం సీఎంకు అర్థమైందని.. ఓటమి భయం జగన్‌ను వెంటాడుతోందని విమర్శించారు. మే లేదా అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా.. అనే ఆలోచనలో పడ్డారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

13వ తేదీ వచ్చినా జీతాలివ్వలేని దుస్థితి..

రాష్ట్రంలో వైకాపా విధానాల వల్ల యావత్తు రాష్ట్రం ఇదేం ఖర్మ అని ఆవేదన చెందుతోందని చంద్రబాబు తెలిపారు. 13వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. జగన్ విధానాలతో అటు రాష్ట్రం.. వ్యక్తిగతంగా ప్రజలు అప్పుల పాలయ్యారని దుయ్యబట్టారు. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నా.. ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

తెదేపా మొదలుపెట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని చంద్రబాబు తెలిపారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకుండా జగన్ భయపెట్టి ఆపగలిగినా.. తెదేపా చేపట్టిన ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ వంటి కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి తమ సమస్యలపై గళమెత్తుతున్నారని చెప్పారు. తెదేపా కార్యక్రమాలకు వెళ్తే పెన్షన్లు, ఇతర పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లతో బెదిరించినా ప్రజలు పెద్ద ఎత్తున పార్టీ సభలకు తరలివస్తున్నారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయడంతో అర్హులకు పెన్షన్లు, ఇతర పథకాలు నిలిపేస్తూ కోతలు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో 12 లక్షల ఇళ్లు నిర్మిస్తే.. వైకాపా ప్రభుత్వం మూడున్నరేళ్లలో పేదలకు కేవలం 5 ఇళ్లు మాత్రమే కట్టిందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ వెనకబడిపోవడానికి జగన్ రెడ్డి విధానాలే కారణమన్నారు. జగన్ వైఫల్యాలు, దోపిడీ కారణంగా ఏ వర్గం ఎలా నష్టపోయిందనే విషయాన్ని ఇదేం ఖర్మ కార్యక్రమంలో చర్చించాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు