Chandrababu: చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది: చంద్రబాబు

నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన తేదేపా 41వ ఆవిర్భావ సభకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Updated : 29 Mar 2023 22:14 IST

 

హైదరాబాద్‌: సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం  అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన తెదేపా 41వ ఆవిర్భావ సభకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేశారు. అనంతరం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ‘‘41 సంవత్సరాల క్రితం చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29. అధికారం కావాలని ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాలేదు. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని పార్టీ పెట్టారు. తెలుగుజాతి కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశమని చెప్పారు. తెలుగు జాతి వసుధైక కుటుంబంగా ఉండటం మనందరి అదృష్టం. మానవత్వమే తన సిద్ధాంతమని ఆనాడు ఎన్టీఆర్‌ చాటి చెప్పారు. ఎన్టీఆర్‌ తెచ్చిన పాలనా సంస్కరణలు చరిత్రలో ఎక్కడా లేవు. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం. సంస్కరణలకు మారు పేరు ఎన్టీఆర్‌.  చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశంపార్టీ ఉంటుంది. తెదేపాకు ముందు.. తర్వాత అని తెలుగుజాతి గురించి మాట్లాడే పరిస్థితి’’ అని చంద్రబాబు వివరించారు.

అధికారంలోకి వస్తాం.. అభివృద్ధిలోకి తెస్తాం

‘‘హైదరాబాద్‌కు దీటుగా అమరావతి నిర్మాణం చేపట్టాం. అమరావతి కోసం రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. విభజన కంటే  జగన్‌ వల్ల ఎక్కువ నష్టం జరిగింది. సైకో అనాలా? దద్దమ్మ అనాలా? చేతకాని వ్యక్తి అనాలా? రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టాడు అనాలో అర్థం కావడం లేదు. ఏపీలో పరిస్థితి చూస్తే బాధేస్తోంది. 30 ఏళ్లు అభివృద్ధి వెనక్కి వెళ్లింది. పులివెందులలో తుపాకీ సంస్కృతి వచ్చింది. మొన్న గొడ్డలి.. ఇప్పుడు తుపాకీ.. గంజాయి సంస్కృతి వచ్చింది. తెలుగుదేశం చారిత్రక అవసరం తెలుగువారందరికీ ఉంది. రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. గ్రాడ్యుయేట్స్‌లో తిరుగుబాటుకు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. మళ్లీ ఏపీలో అధికారంలోకి వస్తాం.. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెస్తాం.

మీ జీవితాన్ని మార్చేది రాజకీయాలే..

తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి. తెలంగాణకు తెలుగుదేశం అవసరం ఉంది.  తెలుగు జాతిని గ్లోబల్‌ లీడర్స్‌గా తయారు చేయాలన్న సంకల్పం తీసుకుంటున్నా. 2047 నాటికి ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌ కమ్యూనిటీగా తెలుగువారు ఉండాలని, అందుకోసం కృషి చేయాలనేది నా సంకల్పం. 12శాతం జనాభా రోజుకు రూ.150 అర్జిస్తుండటం బాధగా ఉంది. ఒకశాతం జనాభా 62శాతం సంపద అనుభవించే పరిస్థితి వచ్చింది. అందరూ కలిసి నిరుపేదలకు అండగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మరొకరికి సహకరించాలి. పేదలను దత్తత తీసుకోవాలి. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నాంది పలుకుతాం. సంపద సృష్టించి పేదలకు పంచడం తెదేపాకు తెలుసు. పేదవాడిని కోటీశ్వరుడిని చేసే బాధ్యత సమాజానిది. అందుకోసం ప్రణాళిక తయారు చేస్తా.. ఉక్కు సంకల్పంతో చేసి చూపిస్తాం. చాలా మంది రాజకీయాలు మనకెందుకు అనుకుంటారు. కానీ, మీ జీవితాన్ని మార్చేది రాజకీయాలే. జగన్ మాదిరి దొంగలు వస్తే రాష్ట్రానికి  ఏం చేస్తారు? సుపరిపాలనకు నాంది పలికిన పార్టీకి సహకరించాలి. ప్రజలతో పార్టీ నడపాలనేది నా సంకల్పం. మంచి వారిని ప్రోత్సహిస్తే సమాజానికి మంచి జరుగుతుంది’’ అని చంద్రబాబు అన్నారు.
 

తెలుగు జాతికి పండుగ రోజు: అచ్చెన్నాయుడు

‘‘యావత్‌ తెలుగు జాతికి ఇవాళ పండుగ రోజు. ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు తెదేపా హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన తర్వాత తెలుగు జాతి చరిత్ర మారింది. పసుపు జెండా అంటే ఆత్మగౌరవమని గుర్తించాలి. ఎన్టీఆర్‌ వచ్చాక తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చింది. హైదరాబాద్‌ సిటీ విదేశాలతో పోటీ పడటానికి కారణం చంద్రబాబు. ఏపీకి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రుల దురదృష్టకరం. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడానికి ఏపీలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్‌ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. రాష్ట్రం విడిపోయినా తెలుగువారు అభివృద్ధి చెందాలనేదే చంద్రబాబు అభిమతం’’ అని అచ్చెన్నాయుడు అన్నారు. తెదేపా తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, తెదేపా అండమాన్‌ అధ్యక్షుడు మాణిక్‌రావు యాదవ్‌, నందమూరి బాలకృష్ణ, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పొలిట్‌ బ్యూరో సభ్యులు, సీనియర్‌ నేతలు హాజరయ్యారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు