Chandrababu: దృష్టి మరల్చేందుకే కోనసీమలో అల్లర్లు: చంద్రబాబు

గత 40 ఏళ్లలో తెదేపా ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్తయితే.. ఈ మూడేళ్లలో వచ్చిన ఇబ్బందులు ఒక ఎత్తు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తమ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతగా రెచ్చిపోతారని చెప్పారు.

Updated : 27 May 2022 16:14 IST

ఒంగోలు: గత 40 ఏళ్లలో తెదేపా ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్తయితే.. ఈ మూడేళ్లలో వచ్చిన ఇబ్బందులు ఒక ఎత్తు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తమ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతగా రెచ్చిపోతారని చెప్పారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా ‘మహానాడు’లో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వైకాపా పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎన్నో పోరాటాలు చూసిన పార్టీ తెదేపా

ఉన్మాది పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని.. చేతగాని దద్దమ్మ పాలనతో రాష్ట్రం పరువు పోయిందని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నో పోరాటాలు చూసిన పార్టీ తెదేపా అని చెప్పారు. ఏపీ చరిత్ర తెదేపా రాకముందు.. వచ్చిన తర్వాత అని చదువుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తెదేపా రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. సేవా భావంతోనూ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిందని గుర్తు చేశారు. వైకాపాకు అభివృద్ధి చేయడం చేతకాదని.. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని విరోధులుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల కోసం పోరాడటం లేదని.. ప్రజలకు ఇబ్బందులుంటేనే నిలదీస్తున్నామని చెప్పారు.

రికమండేషన్లు వద్దు.. మీరు చేసిన పనే మీకు శ్రీరామరక్ష

పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరముందని.. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నూతనోత్సాహంతో ఉండే వాళ్లను ఎంపిక చేస్తామని చెప్పారు. రికమండేషన్లు కాదు.. మీరు చేసిన పనే శ్రీరామరక్ష. పార్టీకి చేసిన సేవలన్నీ డాక్యుమెంటేషన్‌ చేస్తాం. సరైన వ్యక్తులను సరైన స్థానంలో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు చెప్పారు.

‘‘మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరి వేసే పరిస్థితి తీసుకొస్తారా? మీటర్లు పెడితే భవిష్యత్తులో చాలా నష్టం వస్తుంది. వైకాపా పాలనలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మేం అండగా ఉంటాం. రైతులకు మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డి పెట్టారు. దానితోనే వసూలు మొదలు పెట్టారు. తెదేపా హయాంలో పెట్టిన అన్న క్యాంటీన్‌ తీసేశారు. విదేశీ విద్య, పెళ్లి కానుక వంటి పథకాలన్నీ ఏమయ్యాయి? ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు తెదేపా హయాంలో ప్రత్యేక ప్రణాళిక తెచ్చాం. అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకెళ్లాం. తెదేపా.. వెనుకబడిన వర్గాల పార్టీ.

ప్రత్యేక హోదా ఏమైంది?

వైకాపా నేతలు ఎన్నికల ముందు మద్యపాన నిషేధమన్నారు. ఇప్పుడు నాసిరకం బ్రాండ్లతో దండుకుంటున్నారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు.. కనీసం ఇసుక దొరుకుతోందా? వైకాపా దోపిడీతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. భూములు దర్జాగా కబ్జా చేస్తున్నారు. మోసకారి సంక్షేమం అమలు చేస్తున్నారు. వైకాపా అవినీతి వల్లే రాష్ట్రం దివాలా తీసింది. రాష్ట్రాన్ని పాలించే అర్హత ఆ పార్టీకి లేదు. పోలవరం, విభజన హామీలు ఏమయ్యాయి? 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. అది ఏమైంది? గెలిచిన తర్వాత కేంద్రం వద్ద మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. 


 

నాకు సీఎం పదవి కొత్త కాదు..

మద్యం, గంజాయి, డ్రగ్స్‌తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారు. నాకు సీఎం పదవి కొత్తకాదు. ఎక్కువ కాలం ఆ పదవిలో ఉండే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. కానీ రాష్ట్రం నాశమైందనేదే నా ఆవేదన, బాధ. ప్రజలంతా బాధల్లో ఉన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చారు. ఒక్క ఛాన్స్‌తోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక్కసారే కదా కరెంట్‌ తీగ పట్టుకుంటే ఏమవుతుంది?

సామాజిక న్యాయమని గొప్పలా.. రాజ్యసభ సీట్లు ఎవరికిచ్చారు?

ఎస్సీ వ్యక్తి, మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లి వైకాపా ఎమ్మెల్సీ చంపేశారు. హత్య చేశాక మృతదేహాన్ని నేరుగా ఇంటికి తీసుకొచ్చారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రమాదమని చిత్రీకరించారు. ఈ హత్య కేసుతో ఎస్సీల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాని నుంచి దృష్టి మరల్చేందుకే కోనసీమలో అల్లర్లు సృష్టించారు. మంత్రి ఇంటిపై దాడి చేస్తే ఎందుకు అడ్డుకోలేదు? వైకాపా ప్రభుత్వం చేపట్టిన ‘గడపగడపకు ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేదు. అందుకే మంత్రులతో బస్సు యాత్ర పెట్టారు. సామాజిక న్యాయమని గొప్పలు చెబుతూ రాజ్యసభ సీట్లు ఎవరికిచ్చారు?’’ అని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని