హింసా రాజకీయాలకు తెరలేపుతున్నారు

పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైకాపా నాయకులు వ్యవహరిస్తు్న్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు...

Updated : 08 Feb 2021 17:10 IST

వైకాపా నాయకుల​​​​​​పై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల, చిత్తూరు జిల్లా పుంగనూరు తెదేపా నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎం జగన్‌ ఫ్యాక్షన్‌ సిద్ధాంతంతో రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారని ఆక్షేపించారు. జగన్‌ ప్రోద్బలంతోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ హింసా రాజకీయాలకు తెరలేపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు రక్షణ కల్పించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల సంఘంపై ఉందన్నారు. నామినేషన్లు తీసుకోకుండా అడ్డుపడితే ఈమెయిల్ ద్వారా జిల్లా కలెక్టర్‌, ఎన్నికల కమిషన్‌, పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని సూచించారు. 

ఎన్నికల్లో నామినేషన్లు వేసే అవకాశం కూడా లేకుండా భయానక వాతావరణాన్ని మంత్రి పెద్దిరెడ్డి సృష్టించారన్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా నేడు అధికార దుర్వినియోగంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చిన అభ్యర్థులను వేధిస్తున్నారన్నారని ఆరోపించారు. నామినేషన్లు వేస్తే ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరించడం అక్రమాలకు పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి సొంత మండలంలో జరుగుతున్న దాడులపై సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు, ఎస్ఈ‌సీ చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. గ్రామస్థులందరూ సంఘటితంగా పోరాడి రాజ్యాంగమిచ్చిన హక్కులను కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి..

రేవంత్‌రెడ్డి అనూహ్య నిర్ణయం

ఖమ్మం నుంచే కాంగ్రెస్‌ శంఖారావం: మాణికం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని