Andhra news: భూములు, ఖనిజాలు ఎక్కడున్నాయో చూసేందుకే జగన్‌ పాదయాత్ర: చంద్రబాబు

విశాఖలో వైకాపా నేతల కబ్జాలు, ఆక్రమణలను వదిలిపెట్టేది లేదని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రుషికొండకు వెళ్తానంటే తనను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని ప్రశ్నించారు.

Published : 06 May 2022 02:12 IST

విశాఖ: రుషికొండకు వెళ్తానంటే తనను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రుషికొండలో కట్టేది పర్యాటక ప్రాజెక్టే అయితే ప్రభుత్వానికి అంత ఉలికిపాటు ఎందుకని నిలదీశారు. భూములు, ఖనిజాలు ఎక్కడున్నాయో చూసేందుకే జగన్‌ పాదయాత్ర చేశారని విమర్శించారు. రుషికొండకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు. జగన్‌ కన్ను పడితే చాలు.. ఏదైనా గోవిందా.. గోవిందా.. అని ఎద్దేవా చేశారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ రుషికొండను పిండి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో వైకాపా నేతల కబ్జాలు, ఆక్రమణలను వదిలిపెట్టేది లేదని.. వైకాపా నేతలు మింగింది అంతా కక్కిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. విశాఖ జిల్లా తాళ్లవలసలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

‘‘జగన్‌ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నలను జగన్‌ ఎందుకు తగ్గించరు? పెట్రల్‌ ధర ఏపీలో కంటే ఎక్కువ ఏ రాష్ట్రంలోనైనా ఉంటే రాజకీయాలు వదులుకుంటా. దేశంలో పెట్రోల్‌ ధర అధికంగా ఏపీలోనే ఉందని ప్రధాని మోదీ అన్నారు. జగన్‌రెడ్డిని నమ్ముకున్న ఐఏఎస్‌ అధికారులు జైలు పాలవుతున్నారు. సీఎం వల్ల 8 మంది ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష పడింది. నేను పోరాడేది నాకోసం కాదు.. ప్రజల కోసం. జగన్‌ బాదుడే బాదుడుకు విరుగుడు తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎవరికీ లేని వింత ఆలోచనలు జగన్‌కు వస్తాయి. కోడి కత్తి, బాబాయి హత్య వంటి ఆలోచనలతో జగన్‌ గెలిచారు. నరకాసుర వధ పోరాటంలో అందరూ కలిసి రావాలి’’ అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

అందరి తోకలు కట్‌ చేస్తా..

‘‘నాడు - నేడు అని పాఠశాలలకు వైకాపా రంగులు వేశారు. ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేస్తే హైకోర్టు చీవాట్లు పెట్టింది. ప్రశ్న పత్రాల లీకేజీ వల్ల బాగా చదివే విద్యార్థులు నష్టపోతారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చినవన్నీ పాత పథకాలే. తెదేపా పాలనలో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం. హుద్‌హుద్‌ తుపాను వస్తే వారంలోగా సాధారణ స్థితికి తీసుకొచ్చాం. ఒక్క పిలుపు ఇస్తే విశాఖ వాసులు దీపావళి కూడా జరుపుకోలేదు. విశాఖ అభివృద్ధికి అనేక కంపెనీలు తీసుకొచ్చాం. వైకాపా ప్రభుత్వ పాలన వల్ల కంపెనీలన్నీ వెళ్లిపోయాయి. ఏపీలో అన్ని రకాల సహజ వనరులు ఉన్నాయి. వాటిని సరిగా వాడుకుంటే 2029లోగా ఏపీ నంబర్‌ వన్ రాష్ట్రం అవుతుంది. మేం అడ్డుకుంటే జగన్‌కు పాదయాత్ర చేయడం సాధ్యమేనా?వైకాపా పాలనలో ఊరికొక ఉన్మాది తయారయ్యాడు. మేం వచ్చాక సైకోలు అందరికీ తోకలు కట్‌ చేస్తా’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని