Chandrababu: చంద్రబాబు శపథం నెరవేరిన వేళ.. సగర్వంగా గౌరవ సభలోకి..

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైకాపా నేతలు తీవ్రంగా కించపరడంతో సీఎంగానే మళ్లీ అడుగుపెడతానని 2021లో ఆయన శపథం చేశారు.

Updated : 21 Jun 2024 14:44 IST

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైకాపా నేతలు తీవ్రంగా కించపరడంతో సీఎంగానే మళ్లీ అడుగుపెడతానని 2021లో ఆయన శపథం చేశారు. అది నేడు నెరవేరింది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. తొలుత అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత శాసనసభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది’ అంటూ తెదేపా ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ ఆలింగనం చేసుకున్నారు.

తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి కొందరు వైకాపా సభ్యులు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్‌ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆరోజు తీవ్ర మనస్తాపం చెందారు. 

గతంలో చంద్రబాబు చేసిన శపథమిదీ..

‘‘ఇన్నేళ్లూ పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇలాంటి సభలో నేనుండను. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. మీ అందరికీ ఓ నమస్కారం’’ అని 2021 నవంబరు 19న శాసనసభలో చంద్రబాబు తీవ్ర అవమానభారంతో భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు నుంచీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదు. ప్రజాక్షేత్రంలోనే వైకాపాపై బదులు తీర్చుకుని, ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని