Chandrababu: వైకాపా నేతలతో ఎన్నికల అధికారులు కుమ్మక్కు: కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Elections)ల్లో బోగస్‌ ఓట్లు, అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ఫిర్యాదు చేశారు.

Published : 12 Mar 2023 12:40 IST

అమరావతి: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Elections)ల్లో బోగస్‌ ఓట్లు, అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission) తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఈసీకి ఆయన లేఖ రాశారు. వైకాపా నేతలతో పలుచోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కవడంతో పెద్ద ఎత్తున బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో వెలుగుచూసిన బోగస్‌ ఓట్ల వివరాలను లేఖకు ఆయన జత చేశారు. 

‘‘బోగస్‌, నకిలీ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోంది. గతంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా బోగస్‌ ఓట్ల తంతు నడిచింది. పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేడు అదే పునరావృతం అవుతోంది. డిగ్రీ చదవని వారు నకిలీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదయ్యారు. తప్పుడు చిరునామాలతో వైకాపా అభ్యర్థికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చారు. తిరుపతిలో ఒకే ఇంటి చిరునామాతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బోగస్‌ ఓట్లు చేర్చారు. కొందరు ఎన్నికల అధికారులు నకిలీ పత్రాలపై పరిశీలన జరపకుండానే ఆమోదం తెలిపారు.

తిరుపతిలోని 44వ డివిజన్‌లో చికెన్‌ దుకాణం అడ్రస్‌తో 16 బోగస్‌ ఓట్లు నమోదు చేశారు. చాలా ప్రాంతాల్లో ఈ తరహాలో జరిగింది. బోగస్‌ ఓట్లపై విచారణ జరపాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గుర్తుచేశారు. ఈ బోగస్, నకిలీ ఓట్లు ప్రజాస్వామ్య విలువలు, ప్రాథమిక హక్కులకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని అక్రమాలను అడ్డుకోవాలి. బోగస్ ఓట్ల నమోదులో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి’’ అని లేఖలో సీఈసీని చంద్రబాబు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని