ED Raids: కేజ్రీవాల్‌పై పరువు నష్టం కేసు పెడతా.. పార్టీ అనుమతి కోరా: సీఎం చన్నీ

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఈడీ సోదాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం మేనల్లుడు భూపిందర్‌సింగ్‌ ఇంట్లో ఈడీ అధికారులు రూ.6కోట్ల డబ్బు సీజ్‌ చేయడంతో విపక్షాలు సీఎం చన్నీ .......

Published : 21 Jan 2022 16:37 IST

చండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఈడీ సోదాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారం దిల్లీ, పంజాబ్‌ సీఎంల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. సీఎం చన్నీ మేనల్లుడు భూపిందర్‌సింగ్‌ ఇంట్లో ఈడీ అధికారులు రూ.6 కోట్ల నగదు సీజ్‌ చేయడంతో విపక్షాలు ఆయన పైనా, కాంగ్రెస్‌ పార్టీపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ‘చన్నీ సామాన్యుడు కాదు.. నిజాయతీలేని వ్యక్తి’ అంటూ చేసిన ట్వీట్‌పై పంజాబ్‌ సీఎం తీవ్రస్థాయిలో స్పందించారు. కేజ్రీవాల్‌పై పరువు నష్టం కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇతరుల ఇమేజ్‌ని కించపరిచేలా మాట్లాడటం కేజ్రీవాల్‌కు అలవాటేనన్నారు. గతంలో భాజపా నేతలు నితిన్‌ గడ్కరీ, దివంగత నేత అరుణ్‌ జైట్లీ, శిరోమణీ అకాలీదళ్‌ నేత విక్రమ్‌సింగ్‌ మజితియాపైనా ఇలాగే మాట్లాడి ఆ తర్వాత క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని గుర్తుచేశారు. తన నియోజకవర్గం చామ్‌కౌర్‌ షాహిబ్‌లో విలేకర్లతో మాట్లాడిన చన్నీ.. కేజ్రీవాల్‌ తన హద్దులు దాటారనీ.. ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు స్పష్టంచేశారు. ఇందుకోసం తమ పార్టీ అనుమతి కోరానని వెల్లడించారు.

మీ మేనల్లుడు దొరికిపోయినప్పుడో?

పంజాబ్‌ సీఎం మేనల్లుడు భూపిందర్‌సింగ్‌ అలియాస్‌ హనీ ఇంట్లో ఈడీ సీజ్‌ చేసిన కోట్లాది రూపాయల్ని చూసి ప్రజలు షాక్‌ అయ్యారని, వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి చామ్‌కౌర్‌ షాహిబ్‌ నుంచి ఓడిపోతారంటూ కేజ్రీవాల్‌ నిన్న చేసిన వ్యాఖ్యలకు చన్నీ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఈడీ సోదాలు ఎవరిపైనో జరిగాయి. ఇంకెవరి వద్దో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. కానీ కేజ్రీవాల్‌ నన్ను నిజాయతీలేని వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. అంతేకాకుండా ఈడీ సీజ్‌ చేసిన నోట్ల కట్టలతో పాటు నా ఫొటోను సోషల్‌ మీడియాలో ఉంచారు. నన్ను నిజాయతీలేని వ్యక్తిగా చూపుతున్నారు. గతంలో తన మేనల్లుడు ఇలాగే పట్టుబడినప్పుడు కేజ్రీవాల్‌ తనను తాను నిజాయతీలేని వ్యక్తిగానే పిలుచుకున్నారా?’’ అని ప్రశ్నించారు.

ఆ డబ్బు ఏమైనా నా ఇంట్లో దొరికిందా?

‘‘నోట్ల కట్టలతో పాటు నా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఎందుకు? ఆ డబ్బు నాకు వచ్చిందా? ఇందులో నా తప్పు ఏమైనా ఉందా? దీంట్లోకి నన్నెందుకు లాగుతున్నారు? పంజాబ్‌లో 10 చోట్ల ఈడీ దాడులు జరిగాయి. వేరొకరి వద్ద డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో నాకు ఎందుకు సంబంధం పెడుతున్నారు? ఈడీ నా నుంచి ఏమైనా డబ్బులు స్వాధీనం చేసుకుందా? ఈడీ నా ఇంట్లో సోదాలు జరిపి నన్ను అరెస్టు చేస్తే అప్పుడు నన్ను ప్రశ్నించండి’’ అంటూ తన మేనల్లుడి ఇంట్లో ఈడీ సోదాలపై ప్రతిపక్షాల ఆరోపణలకు చన్నీ సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని