
అవెంజర్స్ హీరోలుగా రాహుల్, చన్నీ.. విలన్లుగా మోదీ, కేజ్రీవాల్.. కాంగ్రెస్ వినూత్న వీడియో
దిల్లీ: మరికొద్ది వారాల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. అక్కడ రాజకీయాలు ఊపందుకున్నాయి. అయితే కరోనా కారణంగా రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం ఉన్న నేపథ్యంలో ప్రచారం కోసం రాజకీయ పార్టీలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. పంజాబ్‌లో ఎలాగైనా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ ఓ వినూత్న వీడియోను రూపొందించింది. మార్వెల్ సిరీస్‌లోని సూపర్ హీరో క్యారెక్టర్లకు సీఎం చన్నీ, ప్రధాన నేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూ సహా పలువురి ఫొటోలు జోడించి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దుష్టశక్తులతో పోలుస్తూ సిరీస్‌లోని విలన్లకు ప్రధాని మోదీ, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఫొటోలను జతచేశారు.
‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’లోని ఓ పోరాట సన్నివేశాన్ని రీక్రియేట్ చేస్తూ పంజాబ్ కాంగ్రెస్ అధికార ట్విటర్ వేదికగా పంచుకొంది. అందులో సూపర్ హీరోలైన హల్క్ పాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, థోర్‌గా పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీ, సిద్ధూని కెప్టెన్ అమెరికా పాత్రలతో పోల్చారు. ముఖ్య నేతలు సునీల్ జఖార్, ప్రతాప్ సింగ్ బజ్వాలను కూడా ఇందులో చూపించారు. కాగా ప్రధాని మోదీతోపాటు పంజాబ్‌లో పాగా వేయాలని చూస్తున్న ఆప్ అధినేత అరవింద్ కేజీవాల్ సహా అమరీందర్ సింగ్‌లను ఆ సిరీస్‌లోని ఏలియన్స్ (విలన్) పాత్రలతో పోల్చారు. సూపర్ హీరో పాత్రల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు ఈ ఏలియన్స్‌ను తరిమేస్తున్నట్లు అందులో చూపించారు.
‘పంజాబ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్టశక్తుల బారి నుంచి మన ప్రియమైన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేము ఏం చేసేందుకైనా సిద్ధమే’ అంటూ ఆ వీడియోకి ఈ వ్యాఖ్యలు జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉంటే.. ఆమ్ ఆద్మీ సైతం ఇదే తరహా వీడియోలతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఆమ్ ఆద్మీ పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఎంపీ భగవంత్ మాన్‌ను ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆప్ ఓ వీడియోను పంచుకుంది. సీఎం అభ్యర్థిని వెల్లడించేందుకు.. 2007లో విడుదలైన హిందీ మల్టీస్టారర్ ‘హే బేబీ’ సినిమాలోని ‘మస్త్ కలందర్’ పాటను ఎంచుకుంది. ఇందులో నటించిన షారుక్ ఖాన్‌ను భగవంత్ మాన్‌తో పోల్చారు. అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్‌లను చరణ్‌జిత్ చన్నీ, నవజ్యోత్‌సింగ్ సిద్ధూగా.. విద్యాబాలన్‌ను సీఎం కుర్చీగా పేర్కొన్నారు. చన్నీ, సిద్ధూ సీఎం కుర్చీ కోసం ప్రయత్నిస్తుంటే.. షారుక్ రూపంలో భగవంత్ మాన్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వీడియోలో చూపించారు. దీంతో అక్కడే ఉన్న రాహుల్ గాంధీ తెల్లముఖం వేయగా.. అరవింద్ కేజ్రీవాల్ సంబురాలు చేసుకున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఈ వీడియోకు కూడా నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది.