Charanjit Channi: పంజాబ్‌ను దోచుకునేందుకే వచ్చారు.. కేజ్రీవాల్‌పై మండిపడ్డ చన్నీ

ఎన్నికల వేళ పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి ఊరట! తన సొంత నియోజకవర్గం చామ్‌కౌర్‌ సాహిబ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలపై ఆప్‌ నేతలు ఇటీవల గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన విచారణకు ఆదేశించారు. అయితే.. దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యం...

Published : 13 Feb 2022 13:43 IST

చండీగఢ్‌: ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తనపై అనేక తప్పుడు ఆరోపణలు చేసేందుకు యత్నించారని పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ మండిపడ్డారు. పంజాబ్‌ను దోచుకునేందుకే ఆయన ఇక్కడికి వచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం సొంత నియోజకవర్గం చామ్‌కౌర్‌ సాహిబ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆప్‌ నేతలు ఇటీవల గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన విచారణకు ఆదేశించారు. అయితే.. దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదని స్థానిక డిప్యూటీ కమిషనర్ తాజాగా ప్రాథమిక నివేదిక ఇచ్చారు. కానీ, విచారణ కొనసాగుతుందని చెప్పారు. తదనంతరం చన్నీ మాట్లాడుతూ.. ‘కేజ్రీవాల్‌..  అబద్దాలకోరు. పలు తప్పుడు ఆరోపణలతో నా ప్రతిష్ఠను దిగజార్చేందుకు యత్నించారు. కానీ.. ఏదీ నిజం కాదు. ఆప్‌ నేతలు నాపై గవర్నర్‌కూ ఫిర్యాదు చేయగా.. ఆయన విచారణకు ఆదేశించారు. చివరకు సత్యమే గెలిచింది’ అని వ్యాఖ్యానించారు.

‘బ్రిటీష్ వారు భారత్‌ను కొల్లగొట్టేందుకు వచ్చారు. అదే విధంగా, కేజ్రీవాల్, అతని దిల్లీ కుటుంబ సభ్యులు, ఇతర బయటి వ్యక్తులు పంజాబ్‌ను దోచుకోవడానికి వచ్చారు. అయితే.. మొఘలులు, బ్రిటీషర్ల విషయంలో స్పందించినట్లుగానే పంజాబ్‌ వారిని కూడా సరైన చోటుకే చేర్చుతుంది’ అని చన్నీ అన్నారు. రాష్ట్రంలో ఈ నెల 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చన్నీ.. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చన్నీ మేనల్లుడు భూపిందర్​ సింగ్​ హనీని ఈడీ అధికారులు ఇటీవల అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. అతన్ని కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చరణ్‌జిత్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని