నిరుద్యోగులకు నెలకు రూ.2500 భృతి.. భూపేశ్‌ బఘేల్‌ సర్కారు వరాలు

Monthly allowance for Unemplyed youth: నిరుద్యోగ యువతకు నెలకు రూ.2,500 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించింది.

Published : 06 Mar 2023 20:21 IST

రాయ్‌పూర్‌: ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రంలోని కాంగ్రెస్‌ (Congress) సర్కారు బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించింది. నిరుద్యోగ యువకులకు భృతి, అంగన్వాడీలకు వేతనాలు పెంపు వంటి తాయిలాలను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఆ రాష్ట్రం రూ.1.21 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం భూపేశ్‌ బఘేల్‌ (Bhupesh Baghel) స్వయంగా బడ్జెట్‌ను చదివి వినిపించారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యువతను, రైతులను, కార్మికులను, మహిళలను, నిరుద్యోగులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బడ్జెట్‌లో కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. ఇందులో భాగంగా రాయ్‌పూర్‌-దుర్గ్‌ మధ్య లైట్‌ మెట్రో ప్రాజెక్ట్‌ను బడ్జెట్‌లో బఘేల్‌ ప్రకటించారు. అలాగే, రాష్ట్రంలో 18-35 ఏళ్ల వయసున్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.2,500 చొప్పున భృతి ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది. 12వ తరగతి పాసై, కుటుంబ ఆదాయం రూ.2.5 లక్షల్లోపు ఉన్న వారు దీనికి అర్హులు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు ప్రత్యేకించారు. అంగన్వాడీ కార్యకర్తలకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనం సైతం రూ.6,500 నుంచి రూ.10వేలకు పెంచారు. అంగన్వాడీ సహాయకులకు రూ.3250 నుంచి రూ.5 వేలకు పెంచారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, గ్రామ కొత్వాళ్లకు సైతం గౌరవ భృతిని పెంచుతూ నిర్ణయయం తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని