Goa Election 2022: ‘చిదంబరం సర్‌..మీ ఓట్లు పోయాయనే ఏడుపు ఆపండి’

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం.. గోవా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌, భాజపాల మధ్యే ప్రధాన పోటీ ఉందని అన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌), టీఎంసీలు కేవలం భాజపాయేతర...

Published : 18 Jan 2022 01:44 IST

పనాజీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం.. గోవా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌, భాజపాల మధ్యే ప్రధాన పోటీ ఉందని అన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌), టీఎంసీలు కేవలం భాజపాయేతర ఓట్లను మాత్రమే చీల్చుతాయన్న తన అంచనాను ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం ధ్రువీకరించారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఒకవేళ గోవాలో హంగ్‌ ఏర్పడితే.. సంకీర్ణ ప్రభుత్వంలో భాగమయ్యేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశిస్తూ.. సోమవారం చిదంబరం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

గోవా ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న చిదంబరం.. పాలనలో మార్పు కోసం కాంగ్రెస్‌ను ఎన్నుకోవాలని రాష్ట్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. మరోవైపు చిదంబరం వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌ ఎదురుదాడికి దిగారు. ‘సర్‌.. మీ ఓట్లు పోయాయనే ఏడుపు ఆపండి’ అని ట్వీట్‌ చేశారు. ‘గోవావాసులకు ఎవరిమీదైతే నమ్మకం ఉందో వారికే ఓటేస్తారు. కాంగ్రెస్ కేవలం భాజపాకు మాత్రమే ఆశాకిరణం.. గోవావాసులకు కాదు. మీ 17 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది భాజపాకు మారారు’ అని చిదంబరం ట్వీట్‌లను ట్యాగ్ చేస్తూ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు! కాంగ్రెస్‌కు వేసిన ప్రతి ఓటు భాజపాకు భద్రంగా చేరుతుందని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఆప్‌ తొలిసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గోవాలోని మొత్తం 40 స్థానాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని