వ్యక్తిని కాదు.. పదవిని అవమానించారు!

మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఆరోపించారు. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ డెహ్రాడూన్‌ ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమానాన్ని కేటాయించకపోవడంపై ఆయన మండిపడ్డారు.

Updated : 12 Feb 2021 05:12 IST

ముంబయి: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఆరోపించారు. గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ డెహ్రాడూన్‌ ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమానాన్ని కేటాయించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన గవర్నర్‌ పదవిని అవమానించిందని అన్నారు. ఈ మేరకు ఫడణవీస్‌ గురువారం విలేకరులతో మాట్లాడారు. 

‘కోశ్యారీ ప్రయాణానికి ప్రభుత్వం విమానం కేటాయించకపోవడం ఎంతో దురదృష్టకరం. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. గవర్నర్‌ అంటే వ్యక్తి కాదు.. అదో రాజ్యాంగబద్ధమైన పదవి. గవర్నర్‌ రాష్ట్రానికి అధిపతి కూడా. నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆయన మంత్రివర్గాన్ని కూడా గవర్నరే నియమిస్తారు. కాబట్టి రాజ్యాంగపదవిని తాము అవమానిస్తున్నామనే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి’ అని హితవు పలికారు.

‘గవర్నర్‌ ప్రభుత్వ విమానంలో ప్రయాణించడానికి సంబంధించి సాధారణ పరిపాలన విభాగానికి(జీఏడీ) లేఖ రాశారు. వారు అనుమతిస్తే ఆయన ప్రయాణించడానికి వీలుంటుంది. కానీ రాష్ట్ర సీఎస్‌ ఆ దస్త్రాన్ని సీఎం వద్ద ఉంచారు. దీంతో గవర్నర్‌ ప్రయాణించే సమాయానికి కూడా జీఏడీ నుంచి అనుమతులు రాలేదు. దీంతో గవర్నర్‌ విమానం దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన అహంకార ధోరణితో చిన్న పిల్లల మాదిరి వ్యవహరించడం సరికాదు. ఈ ఘటన వల్ల గవర్నర్‌ ప్రతిష్టకు ఏం భంగం కలగదు. రాష్ట్ర గౌరవమే అప్రతిష్ట పాలవుతుంది’ అని ఫడణవీస్‌ ఘాటు విమర్శలు చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీ నేడు ప్రభుత్వ విమానంలో డెహ్రాడూన్‌ వెళ్లేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో అనుమతులు లేవంటూ పైలట్‌ చెప్పడంతో విమానాశ్రయంలోనే రెండు గంటల పాటు నిరీక్షించారు. అనంతరం ప్రైవేటు విమానంలో డెహ్రాడూన్‌కు బయలుదేరారు.

ఇదీ చదవండి

మహారాష్ట్రలో మళ్లీ గవర్నర్‌ వర్సెస్‌ సీఎం 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని