Nara Lokesh: నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రకు పోలీసుల అనుమతి

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.

Updated : 24 Jan 2023 20:26 IST

చిత్తూరు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

పాదయాత్రలో ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్‌ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని ఎస్పీ సూచించారు. ‘‘పాదయాత్ర, కుప్పంలో బహిరంగ సభకు అనుమతి కోరుతూ పలమనేరు ఎస్డీపీవో సుధాకర్‌రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్‌ వినతిపత్రం అందించారు. దీనిపై అన్ని అంశాలను పరిశీలించి పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశాం. అనుమతి ఇవ్వకముందే కొన్ని సోషల్‌ మీడియా గ్రూపుల్లో కక్ష సాధింపు అంటూ ప్రభుత్వంపై నిందలు మోపి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అన్ని రకాలుగా పరిశీలించి అనుమతి ఇచ్చాం. 

బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదు. రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నిర్వహించేందుకు సమావేశ స్థలంలో ప్రథమ చికిత్స, వైద్య పరికరాలతో అంబులెన్స్‌లను ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచాలి. బాణసంచా కాల్పడం పూర్తిగా నిషేధం. పార్టీ కార్యకర్తలు, సమావేశంలో పాల్గొనేవారు ఎలాంటి మారణాయుధాలు తీసుకెళ్లకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. విధుల్లో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను పాటించాలి. శాంతిభద్రతల నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరించాలి. ఈ నిబంధనలకు లోబడి పాదయాత్ర చేసుకోవాలి’’ అని ఎస్పీ పేర్కొన్నారు. 

ఈనెల 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ‘యువగళం’ ప్రారంభం కానుంది. పట్టణంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లోకేశ్‌ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఇది కొనసాగనుంది.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని