Arvind Kejriwal: ‘ఐబీ నివేదిక ప్రకారం.. గుజరాత్‌లో ఆప్‌దే విజయం!’

ఇప్పటికిప్పుడు గుజరాత్‌లో ఎన్నికలు పెడితే వచ్చేది ఆప్‌ ప్రభుత్వమేనని పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో నివేదిక ఇదే విషయాన్ని తెలియజేస్తోందని చెప్పారు...

Published : 03 Oct 2022 01:23 IST

గాంధీనగర్‌: ఇప్పటికిప్పుడు గుజరాత్‌(Gujarat)లో ఎన్నికలు పెడితే వచ్చేది ఆప్‌(AAP) ప్రభుత్వమేనని పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) అన్నారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో నివేదిక(IB Report) ఇదే విషయాన్ని తెలియజేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో.. ఆప్ ఓట్లను చీల్చేందుకు భాజపా(BJP), కాంగ్రెస్‌లు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ‘ఐబీ నివేదికతో భాజపా కుంగిపోయింది. దీంతో కాంగ్రెస్(Congress), భాజపాలు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. భాజపా వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ నేతలు.. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి యత్నిస్తున్నారు. ఆప్‌ ఓట్లను కొల్లగొట్టే బాధ్యత కాంగ్రెస్‌కు అప్పగించారు’ అని ఆదివారం రాజ్‌కోట్‌లో కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ 10 సీట్లకు మించి గెలవదని.. విజయం సాధించిన వారూ భాజపాలో చేరతారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌కు ఓటు వేయడం వృథా. భాజపా పాలనతో విసిగిపోయిన వారందరూ ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి. దిల్లీ, పంజాబ్‌ రికార్డులను బద్దలు కొట్టండి’ అని రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. స్వల్ప మెజారిటీతో ఆప్‌ గెలుస్తుందని ఐబీ రిపోర్టులో ఉందని చెబుతూ.. దీన్ని మరింత పెంచేలా పెద్దఎత్తున మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆవుల పోషణకు రోజుకు రూ.40 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు.. రోడ్లపై తిరిగే, పాలు ఇవ్వని ఆవుల కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సంరక్షణ కేంద్రాలు నిర్మిస్తామని తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని