GHMC: జీహెచ్‌ఎంసీ సమావేశంలో కార్పొరేటర్ల బాహాబాహీ

కార్పొరేటర్ల తోపులాటలు.. పరస్పరం దాడికి యత్నం.. కుర్చీల నుంచి తోసివేతలు.. ఇలా హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పాలకవర్గ సమావేశంలో సుమారు నాలుగు గంటలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 07 Jul 2024 04:10 IST

భాజపా సభ్యులపైకి దూసుకెళ్లిన ఎంఐఎం ప్రతినిధులు
మేయర్, డిప్యూటీ మేయర్‌ల రాజీనామాలకు భారాస నేతల డిమాండ్‌

భాజపా, ఎంఐఎం కార్పొరేటర్ల తోపులాట 

ఈనాడు, హైదరాబాద్‌: కార్పొరేటర్ల తోపులాటలు.. పరస్పరం దాడికి యత్నం.. కుర్చీల నుంచి తోసివేతలు.. ఇలా హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పాలకవర్గ సమావేశంలో సుమారు నాలుగు గంటలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆరు నెలల విరామం అనంతరం శనివారం జీహెచ్‌ఎంసీ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఓవైపు భారాస, కాంగ్రెస్‌ కార్పొరేటర్ల ఆరోపణలు, ప్రత్యారోపణలు.. మరోవైపు ఎంఐఎం, భాజపా కార్పొరేటర్ల కొట్లాటతో సభ అట్టుడికింది. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి భారాస తరఫున ఎన్నికయ్యారు. ఇటీవల వారు కాంగ్రెస్‌లో చేరినందువల్ల తమ పదవులకు రాజీనామా చేయాలంటూ గులాబీ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్‌లను చుట్టుముట్టి నినాదాలు చేశారు. అదే సమయంలో ‘కాంగ్రెస్, భారాస, ఎంఐఎం దోస్తీ.. సమస్యలతో ప్రజల కుస్తీ’ అని రాసిన ప్లకార్డులను భాజపా నేతలు ప్రదర్శించారు. వాటిపై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీల క్యారికేచర్లు ఉన్నాయి. తమ నేత క్యారికేచర్‌ను ఎలా ప్రదర్శిస్తారంటూ భాజపా సభ్యులపైకి ఎంఐఎం నేతలు దూసుకెళ్లారు. కొందరు భాజపా కార్పొరేటర్లను కుర్చీల్లోంచి తోసేశారు. వారి చేతుల్లోని ప్లకార్డులను లాక్కున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. మధ్యమధ్యలో సమావేశాన్ని మేయర్‌ నాలుగుసార్లు వాయిదా వేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో.. సమావేశాన్ని ముగుస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని