Telangana News: 7 మండలాలను తిరిగి తెచ్చుకునేందుకు ఏం చేస్తారు?: భట్టి విక్రమార్క

వరద బాధితులకు వెంటనే న్యాయం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

Published : 20 Jul 2022 01:46 IST

హైదరాబాద్‌: వరద బాధితులకు వెంటనే న్యాయం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రాజెక్టులను నిపుణులైన ఇంజినీర్లు డిజైన్‌ చేస్తేనే బాగుంటుందని.. అవగాహన లేని నేతలు డిజైన్‌ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని దుయ్యబట్టారు. సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో మాట్లాడారు.

‘‘రీడిజైనింగ్‌లో పొరపాట్లు ఉన్నాయని 2014 నుంచి చెప్తున్నాం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే అందరికీ మంచిదని చెప్పాం. అవగాహన లేకుండా రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి నిరుపయోగం చేశారు. బ్యాక్‌ వాటర్‌తో కాళేశ్వరం పంప్‌హౌస్‌లు మునిగిపోయాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు మరో 3 మీటర్లు పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏపీ ప్రభుత్వ చర్యను తెరాస ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదు. 7 మండలాలను తిరిగి తెచ్చుకునేందుకు ఏం చేస్తారో చెప్పాలి’’ అని భట్టి డిమాండ్‌ చేశారు.

‘‘కాంగ్రెస్ డిజైన్ చేసిన ప్రాజెక్టును నిర్మాణం చేయకుండా రీ-డిజైన్ పేరుతో రూ.కోట్లు వృథా చేశారు. 7 మండలాలు ఏపీలో విలీనం చేస్తే ఖమ్మం జిల్లాకు జరిగే నష్టాన్ని ఆనాడు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లాం. వాటిని ఏపీలో కలపడానికి మేం ఒప్పుకోమని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపారా లేదా? తెలంగాణపై ప్రేమ ఉంటే ఇంత జరిగే వరకు చూస్తూ ఊరుకోరు. పోలవరం ఎత్తు పెంచుతుంటే అధికారంలో ఉండి ఏం చేస్తున్నారు? రోజూ గూగుల్ మ్యాప్‌లో ప్రాజెక్టులను చూసే ముఖ్యమంత్రి పోలవరం ఎత్తు పెంచుతుంటే ఎందుకు అడ్డుకోలేదు? 7 మండలాలపై అసెంబ్లీలో చేసిన తీర్మానానికి న్యాయం చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉంది.

కరకట్ట కట్టాలని వైఎస్‌ఆర్ ఉన్నప్పుడే నిధులు విడుదల చేశారు. తెరాస వచ్చాక వాటిని రద్దు చేసింది. బిల్లులో లేని వాటికి ఆర్డినెన్స్ తెచ్చి 7 మండలాలను ఏపీలో కలిపారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం 3వేల ఎకరాలకే ఒప్పుకోలేదు. అలాంటిది 2లక్షల ఎకరాలు పోతుంటే కేసీఆర్‌ ఎలా ఒప్పుకున్నారు?వరద రావడంపై విచారణ చేయాల్సిన భాద్యత ప్రభుత్వంపైన ఉంది. ప్రజలను వరదల నుంచి దృష్టి మరల్చేందుకే క్లౌడ్ బరస్ట్ అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్‌పై ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోతోంది’’ అని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని