congress: అధికార కాంక్షే ఉంటే రాష్ట్రాన్ని విభజించే వాళ్లం కాదు: జడ్చర్లలో హిమాచల్‌ సీఎం

జడ్చర్లలోని రాజీవ్‌గాంధీ మైదానంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో హిమాచల్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కు మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఓపీఎస్‌ తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Updated : 25 May 2023 22:40 IST

జడ్చర్ల: తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకే దక్కుతుందని హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కు అన్నారు. కాంగ్రెస్‌కు అధికార కాంక్షే ఉంటే రాష్ట్రాన్ని విభజించే వాళ్లం కాదని ఆయన స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క పాదయాత్ర 800 కి.మీ పూర్తయిన సందర్భంగా గురువారం జడ్చర్లలోని రాజీవ్‌గాంధీ మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో పాటు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుఖ్వీందర్‌ సింగ్‌ మాట్లాడారు. పార్టీ పరంగా ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా నష్టపోయామని గుర్తుచేశారు. హిమాచల్‌లో పాత పింఛన్‌ స్కీమ్‌ తెచ్చామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణలోనూ ఓపీఎస్‌ తెస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ సామాజిక.. ఆర్థిక కోణంలోంచే చూస్తోందని చెప్పారు. 

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భట్టి

కాంగ్రెస్‌ పార్టీ పంచిన అటవీ భూములను కేసీఆర్‌ గుంజుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పాదయాత్రలో పోడు భూముల పట్టాలను గిరిజనులు తనకు చూపించారని వెల్లడించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భారాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదన్నారు. పాదయాత్రలో గిరిజనుల కష్టాలు చూశానని, ధరణిలో భూముల వివరాలు కనిపించట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని భట్టి తెలిపారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని కేసీఆర్‌ మాట ఇచ్చారు. కానీ, తెలంగాణ వచ్చినా ఇంకా పాలమూరులో వలసలు ఆగలేదు. నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. కేసీఆర్‌ కుటుంబం రాజ్యాలు ఏలితే.. బడుగు బలహీనవర్గాల బిడ్డలు కులవృత్తులు చేసుకోవాలా? నేను మీరు నాటిన మొక్కను.. ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా మీ ముందున్నా. ఇది మిడ్జిల్‌ మండల ప్రజల గొప్పతనం. నల్లమల అడవుల్లో పుట్టిన మీ బిడ్డ పీసీసీ అధ్యక్షుడిగా మీ ముందు నిలబడటానికి సోనియా గాంధీ అవకాశం ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎవరు అడ్డుకున్నారని కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నా. తులసి వనంలో గంజాయి మొక్కలా.. పాలమూరు అభివృద్ధిని కేసీఆర్‌ అడ్డుకుంటున్నారు.

పాలమూరులో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్‌ హయాంలో జరిగిందే. ఇక్కడ జరిగిన అభివృద్ధిపై జడ్చర్ల చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చర్చ పెడదాం. పాలమూరును ఎవరి అభివృద్ధి చేశారో తేలుద్దాం. మీ బిడ్డకు అవకాశం వచ్చింది. ఇది మన ఆత్మగౌరవ సమస్య. పాలమూరు జిల్లా నుంచి 14కు 14 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు గెలిపించాలి. పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత మాది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునేందుకు పేదలకు రూ.5లక్షలు ఇస్తాం. రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. రూ.500కే పేదలకు గ్యాస్‌ సిలిండర్‌ అందించే బాధ్యత కాంగ్రెస్‌ది’’ అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు