Bhatti vikramarka: సెంటిమెంట్‌ రగిల్చే కుట్రలో భాగమే సజ్జల వ్యాఖ్యలు: భట్టి

సమైక్య రాష్ట్రం నినాదంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీనేత భట్టి విక్రమార్క స్పందించారు. సజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు.

Published : 08 Dec 2022 16:59 IST

హైదరాబాద్‌: సమైక్య రాష్ట్ర నినాదంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ‘‘సజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చింది. సమైక్య నినాదం ఇవాళ కొత్తకాదు. అప్పుడు కూడా వాళ్లు అదే అన్నారు. మళ్లీ సెంటిమెంట్‌ రగిల్చే కుట్రలో భాగమే సజ్జల కామెంట్స్‌. తెలంగాణ ఆలోచనకు భిన్నంగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయి. మళ్లీ సమైక్య రాష్ట్ర నినాదం అనే వాదనతో ఉపయోగం లేదు. కాంగ్రెస్‌ పార్టీ ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకం’’ అని భట్టి విక్రమార్క అన్నారు. 

మోదీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు..

హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ విజయం దేశంలో రాజకీయం మారుతుందనడానికి సంకేతమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో మోదీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, భాజపా అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజలు తిరస్కరించారని తెలిపారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉండేదని.. కానీ, ప్రధాని నరేంద్రమోదీ అధికార దుర్వినియోగంతో గెలుపొందారని దుయ్యబట్టారు. గుజరాత్‌లో భాజపా గెలుపును విజయంగా చూడలేమని.. ప్రధాని హోదాను మర్చిపోయి ఎన్నికల ప్రచారం నిర్వహించారని విమర్శించారు. దేశమంతటికీ చెందిన వనరులన్నీ గుజరాత్‌కు తరలించారని ధ్వజమెత్తారు. కార్పొరేట్‌ శక్తులను అక్కడికి తరలించి డబ్బు పంచి మోదీ విజయం సాధించారని ఆరోపించారు. గుజరాత్‌లో లౌకికవాదాన్ని చీల్చి.. ఆప్‌, ఎంఐఎంలను భాజపానే ప్రోత్సహించి ఓట్లు చీల్చి గెలిచిందన్నారు. మోదీ ప్రధాని స్థాయిని మర్చిపోయి ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టారని భట్టి మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని