Polavaram project: పోలవరానికి జగన్‌ ద్రోహం.. క్షమించరాని నేరం

పోలవరం ప్రాజెక్టును చూస్తుంటే బాధ, చెప్పలేనంత ఆవేదన కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఐదేళ్లు చేసిన పనంతా రివర్స్‌ అయిపోయిందని, గడిచిన ఐదేళ్లూ ప్రాజెక్టును అస్తవ్యస్తం చేసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 18 Jun 2024 06:45 IST

చేతకాని వ్యక్తి పాలిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఈ ప్రాజెక్టే నిదర్శనం
నిర్మాణానికి నాలుగేళ్లు పడుతుందని అధికారుల మాట
లోతుగా అధ్యయనం చేయాలి
మా కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది
ఆవేదన, బాధతో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిశీలన
ఈనాడు - అమరావతి

పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుత పరిస్థితి


పాలకుడి వల్ల ఇంత నష్టం జరిగితే ఏం చేయాలి?

రాష్ట్రానికి ఒక పాలకుడి వల్ల ఇంత నష్టం జరిగితే ఏం చేయాలో ప్రజలు చర్చించాలి. ఎంత నష్టం జరిగింది? ఎన్ని వేల కోట్లు నష్టపోయాం? మన భవిష్యత్తు ఎలా పోయింది, తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలా వద్దా, ఎవరు శిక్షించాలి.. వంటి అంశాలపై ప్రజల మధ్యే చర్చ జరగాలి. నిర్వాసితుల విషయమూ చర్చించాలి. ఇప్పటికే భూసేకరణ చేసి పునరావాసం కల్పించి ఉంటే ఇంత అదనపు భారం పడేది కాదు.  

చంద్రబాబు
వ్యూ పాయింట్‌ నుంచి పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు.

చిత్రంలో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు

పోలవరం ప్రాజెక్టును చూస్తుంటే బాధ, చెప్పలేనంత ఆవేదన కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఐదేళ్లు చేసిన పనంతా రివర్స్‌ అయిపోయిందని, గడిచిన ఐదేళ్లూ ప్రాజెక్టును అస్తవ్యస్తం చేసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రకాల చిక్కుముళ్లు వేయాలో వేసి.. అన్ని రకాలుగా సంక్లిష్టం చేసేశారని వాపోయారు. తమ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసేశారని.. పోలవరం ప్రస్తుత స్థితి చూసి అందరికంటే తానే ఎక్కువ బాధపడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రతి నిర్మాణాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. అక్కడే అధికారులతో మాట్లాడారు. తర్వాత ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, విలేకర్లతో మాట్లాడారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. పాలనకు అనర్హుడు. ఒక రాష్ట్రాన్ని ఇలాంటి వ్యక్తి పాలించకూడదు, పాలిస్తే ఏమవుతుందో చెప్పేందుకు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు దుస్థితి ఒక పెద్ద ఉదాహరణ. అలాంటి నాయకుడు రాష్ట్రానికి ఎంత శాపంగా మారతారో కళ్ల ముందు కనిపిస్తోంది. ఇది తప్పు కాదు- క్షమించరాని నేరం. ఇప్పుడు పోలవరం పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలియదు. నిర్మాణం పూర్తి చేయడానికి నాలుగేళ్లు పడుతుందని ఇంజినీర్లు అంటున్నారు. కానీ పూర్తిస్థాయి నిర్మాణానికి ఎన్నాళ్లు పడుతుందో ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే తప్ప చెప్పలేం. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకోవాలి. తప్పులు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర, జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఒక్కరోజైనా జగన్‌ ప్రాజెక్టును చూసి, విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడారా.. ఏం చేయాలనుకుంటున్నారో చెప్పారా అని ఆవేదనగా ప్రశ్నించారు.  తనను కూడా ప్రాజెక్టు వద్దకు రాకుండా అడ్డుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి వివరిస్తున్నంతసేపు ఆయన మాటల్లో ఆవేదన, బాధ కనిపించాయి. 

రివర్స్‌తో రూ.వేల కోట్ల అదనపు ఖర్చు.. సమయం వృథా 

‘జగన్‌ వస్తూనే పోలవరంలో రివర్స్‌ టెండర్లు అన్నారు. నాలుగైదు రోజుల్లో ఏజెన్సీని బయటకు పంపేశారు. ఇంజినీరింగ్‌ చీఫ్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అందరినీ మార్చేశారు. ఏమీ తెలియని సిబ్బందిని పెట్టేశారు. తక్షణమే చేయాల్సిన పనులను ఆపివేయడంతో వరుసగా రెండేళ్లు వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్‌ నాలుగుచోట్ల ధ్వంసమయింది. మొత్తం 35 శాతం దెబ్బతింది. అప్పట్లో డయాఫ్రం వాల్‌కు రూ.446 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు దానికి మరమ్మతులు చేయాలన్నా రూ.447 కోట్లు అవుతుంది. మొత్తం డ్యాం అంతా బాగుందని, మరమ్మతు చేస్తే చాలనే నమ్మకం లేదు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలంటే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. డయాఫ్రం వాల్‌ను కాపాడాల్సిన ప్రభుత్వం ప్రాజెక్టు భవిష్యత్తుతో ఆటలాడుకుంది. ఇప్పుడేం చేయాలో అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చింది. 


విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పితాని సత్యనారాయణ,
చిర్రి బాలరాజు,ఎంపీ మహేశ్‌యాదవ్, మంత్రులు రామానాయుడు, పార్థసారథి, కందుల దుర్గేష్‌

  • ఎగువ కాఫర్‌ డ్యాంలో చివరన ఉన్న గ్యాప్‌ను పూడ్చకపోవడం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. అప్పుడు ఏజెన్సీ లేదు. ఇంజినీర్లు లేరు. దాంతో ఆ పని చేయలేదు. గుత్తేదారును మార్చవద్దని కేంద్రం చెప్పినా.. ఏదైనా లోపం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించినా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. 
  • ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లు పూడ్చకపోవడంతో వరద నీరు ఉద్ధృతంగా సుడిగుండాల్లా వచ్చి ప్రధాన డ్యాం ప్రాంతంలో ఇసుక 20 మీటర్ల మేర కోసుకుపోయింది. అగాథాల్లా ఏర్పడింది. అక్కడ ఇసుక పూడ్చి, గట్టిదనం వచ్చేలా చేసే పనికి రూ.2,200 కోట్లు ఖర్చయిందని లెక్కలు వేశారు. ఇంకా ఎంత ఖర్చవుతుందో తెలియదు.
  • రెండు కాఫర్‌ డ్యాంల నిర్మాణానికి రూ.540 కోట్లు ఖర్చయింది. వాటిలో అవసరానికి మించిన సీపేజీ వస్తోంది. దాన్ని నియంత్రించకపోతే డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం నిర్మాణం కష్టం. ఇందుకు ఏం చేయాలో చెప్పడానికి కేంద్ర జలసంఘం అంతర్జాతీయ నిపుణుల ఏజెన్సీని ఏర్పాటు చేసింది. వారు అధ్యయనం చేస్తున్నారు. ఆ నీళ్లన్నీ వచ్చినవి వచ్చినట్లు ఎత్తిపోయాలంటే ఎంత ఖర్చవుతుందో కూడా తెలియదు.
  • ప్రాజెక్టు నిర్మాణం కొనసాగి ఉంటే 2022కల్లా పూర్తయ్యేది. ఇప్పుడు కనీసం నాలుగేళ్లు పడుతుందంటున్నారు. అదీ అన్నీ సవ్యంగా జరిగితేనే. ఇంకా నేను అధ్యయనం చేయాలి. ఏయే అంశాల్లో ఏయే లోతులు ఉన్నాయో గమనించాలి. కేంద్ర మంత్రితో మాట్లాడాలి. ఇవన్నీ ఆలోచించి సమగ్రంగా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. అప్పటికి కాని ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేం.

సగటున రూ.13,683 కోట్ల ఖర్చు

సాగునీటి ప్రాజెక్టులపై తెదేపా ప్రభుత్వం ఖర్చు చేసినన్ని నిధులు చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఖర్చుపెట్టలేదు. గత తెదేపా ప్రభుత్వంలో ఏటా సగటున 13,683 కోట్లు ఖర్చు చేశా. జగన్‌ ప్రభుత్వంలో దాన్ని రూ.7,100 కోట్లకు తగ్గించేశారు. ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చారు తప్ప ఏ పనులూ చేయలేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సగటున రూ.4,200 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలో రూ.3,430 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికిప్పుడు పని చేసే గుత్తేదారు ఏజెన్సీని మార్చడం కాదు పరిష్కారం. ఏం చేయాలో సమగ్రంగా ఆలోచించాలి.


గైడ్‌బండ్‌ను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు, జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ తదితరులు


ఎంతో చేశా.. మరెంతో చేయాలనుకున్నా

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు. రాష్ట్రానికే ఒక వరంగా భావించి శ్రద్ధ పెట్టాం. పోలవరం పూర్తయితే రాష్ట్రానికి కరవు అనేది లేకుండా చేయొచ్చనుకున్నాం. 2014-19 మధ్య ఈ ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తి చేశాం. 2014లో రాష్ట్రం విడిపోయేనాటికి ఏడు ముంపు మండలాలు తెలంగాణలో ఉన్నాయి. రెండు రాష్ట్రాలుగా జూన్‌ 2న నోటిఫై అవుతాయి. అదే జరిగితే రెండు రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటే తప్ప మండలాల బదిలీ జరగదు. అందుకే పార్లమెంటు సమావేశమయ్యేలోపే రాష్ట్రపతితో మాట్లాడించి ఆర్డినెన్సు రప్పించాం. ఏడు మండలాలు ఇవ్వకపోతే సీఎంగా ప్రమాణం చేయనని చెప్పేశా. అది సాధించాం కాబట్టే పోలవరం పనులు అప్పుడు చేసుకోగలిగాం. ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరగాలని పండగ రోజు నాగపుర్‌ వెళ్లి నితిన్‌ గడ్కరీని కలిశాం. అంతకు ముందు కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశమయ్యాం. నేను 30సార్లు పోలవరాన్ని  సందర్శించా. ఈ రోజు 31వసారి. వందసార్లు పోలవరంపై సమీక్షించా’ అని చంద్రబాబు గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని