Chandrababu: రెండో రోజూ సచివాలయంలో సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు వరుసగా రెండో రోజూ సచివాలయానికి రావడంతో సందడి నెలకొంది. ఆయన్ను కలిసేందుకు నేతలు, సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎంగా గురువారం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ద్వితీయ విఘ్నం ఉండకూడదని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయానికి వచ్చారు.

Published : 15 Jun 2024 05:41 IST

మంత్రులు.. నేతలు.. సందర్శకులతో కళకళ

ఈనాడు, అమరావతి: సీఎం చంద్రబాబు వరుసగా రెండో రోజూ సచివాలయానికి రావడంతో సందడి నెలకొంది. ఆయన్ను కలిసేందుకు నేతలు, సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎంగా గురువారం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ద్వితీయ విఘ్నం ఉండకూడదని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయానికి వచ్చారు. తొలుత ఆయన షెడ్యూలు ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు తిరిగి వెళ్లాలి. కానీ, అధికారిక కార్యక్రమాలతో పాటు.. పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు, మంత్రులు చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్‌ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారితో పాటు పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు సీఎంను కలిశారు. చంద్రబాబును అభినందించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీకి చెందిన పలువురు నేతలు సచివాలయానికి వచ్చారు. దీంతో ఆయన సాయంత్రం 6.30 వరకు సచివాలయంలోనే ఉన్నారు. భారీసంఖ్యలో సందర్శకులు రావడంతో సచివాలయం సందడిగా మారింది.

మంత్రులు ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తారనే నమ్మకం ఉంది: చంద్రబాబు

 ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి మంత్రులందరూ కృషి చేస్తారని నమ్ముతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సహా 24 మంది మంత్రులకు శాఖల కేటాయింపుపై శుక్రవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని, ప్రజాపాలన శకానికి నాంది పలుకుతామని మనం ప్రతిజ్ఞ చేశాం. మీరంతా ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాలి. సేవ, శ్రద్ధతో ఈ యాత్ర ప్రారంభించిన మీ అందరికీ శుభాకాంక్షలు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రులు, వారి శాఖలకు సంబంధించిన వివరాల్ని పోస్టుకు జత చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు