Chandrababu: భాజపా నేతలకు చంద్రబాబు విందు

ఇటీవల ఎన్నికల్లో గెలిచిన భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విందు ఇచ్చారు.

Published : 21 Jun 2024 04:34 IST

పేరుపేరునా పలకరించిన సీఎం
శాలువాలు కప్పి, సత్కారం

కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పక్కన భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. చిత్రంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పార్థసారథి, ఎంపీ సీఎం రమేశ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సుజనాచౌదరి, ఈశ్వర్‌రావు తదితరులు 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఇటీవల ఎన్నికల్లో గెలిచిన భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విందు ఇచ్చారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌రావు, ఆదినారాయణరెడ్డి, పార్థసారథి, ఎన్‌.ఈశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు గురువారం రాత్రి ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వారిని ఆహ్వానించారు. భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలను చంద్రబాబు శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వారిని పేరుపేరునా పలకరించారు. విందు సందర్భంగా చంద్రబాబు భాజపా నేతలకు తానే ప్లేట్లు అందజేసి, వారితో కలిసి భోజనం చేశారు. 

మూడు పార్టీల నేతలతో సమన్వయకమిటీలు

రాష్ట్ర పరిస్థితులు, ఎన్నికలు జరిగిన తీరు, మూడు పార్టీలు సమష్టిగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడాల్సిన ఆవశ్యకత సహా వివిధ అంశాలపై చంద్రబాబు భాజపా నేతలతో ముచ్చటించారు. పాలనలో సమన్వయం కోసం మూడు పార్టీల నేతలతో నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిల్లో కమిటీలు వేయాలని, రాజధాని అమరావతిలో భాజపా కార్యాలయం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని వారు ఆయన్ను కోరారు. నరేగా నిధులతో అనపర్తి నియోజకవర్గంలో కాకినాడ కెనాల్‌ను బాగు చేయించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబుతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. ‘నువ్వు ఎక్కడున్నా పని ఆపవు కదా!’ అని సీఎం ఆయన్ను మెచ్చుకున్నారు. కాలువల మరమ్మతులతోపాటు రహదారుల నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని సీఎం వారితో అన్నారు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన దాడుల్ని సుజనాచౌదరి ప్రస్తావించగా.. మూడు పార్టీలవారూ ఇబ్బంది పడ్డామని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలు పవన్‌ కల్యాణ్‌తో భేటీ కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని