Chandrababu: మళ్లీ జన్మ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన స్థానిక బస్టాండ్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు.

Updated : 25 Jun 2024 17:45 IST

కుప్పం: మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ‘‘నేను ఇక్కడకు వచ్చినా.. రాకున్నా నన్ను ఆదరించారు. ఇప్పటి వరకు నన్ను 8 సార్లు గెలిపించారు. కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. కుప్పం వ్యవహారాలు చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్‌, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, మండల పార్టీ నేతలకు అభినందనలు. మొన్నటి ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించారు. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం.

అహంకారంతో విర్రవీగితే.. ప్రజాస్వామ్యంలో వైకాపాకు పట్టిన గతే పడుతుందని ప్రజలు నిరూపించారు. నా రాజకీయాలకు కుప్పం నియోజకవర్గం ప్రయోగశాల. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పంను ఎంచుకున్నా. చిత్తూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటా. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తా. మొన్నటి ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. కేబినెట్‌లో 8మంది బీసీలకు అవకాశం కల్పించాం. వైకాపా పాలన పీడకల.. అలాంటిది ఎప్పుడూ చూడలేదు. వైకాపా ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలు అసహ్యించుకున్నారు. ఏ తప్పూ చేయకున్నా 30 మంది కార్యకర్తలను జైల్లో పెట్టారు. కుప్పం ప్రశాంతమైన స్థలం.. ఇక్కడ హింసకు చోటు లేదు. కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే కడపటి రోజు.. జాగ్రత్త’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

ఇవాళ్టి నుంచే అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నా..

ఐదేళ్లుగా కుప్పంలో ఎలాంటి అభివృద్ధీ లేదని.. అభివృద్ధి పనులు ఇవాళ్టి నుంచే ప్రారంభిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ‘‘ నియోజకవర్గంలోని ప్రతి ఊరిలో తాగునీరు, డ్రైనేజీలు, వీధిదీపాలు ఏర్పాటు చేస్తాం. అన్ని గ్రామాలకు కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి ద్వారా మళ్లీ మినరల్‌ వాటర్‌ ఇస్తాం. అన్ని గ్రామాలు, పంట పొలాల వద్దకు రోడ్లు వేస్తాం. హంద్రీ-నీవా కాలువను ఇప్పుడే పరిశీలించా. కుప్పంలోని నాలుగు మండలాలను ఆదర్శపట్టణాలుగా అభివృద్ధి చేస్తాం. వీలైనంత తొందరలోనే కుప్పంకు విమానాశ్రయం వస్తుంది. స్థానిక ఉత్పత్తులను కుప్పం నుంచి ఎయిర్‌ కార్గో ద్వారా విదేశాలకు పంపిస్తాం.

ఇంటికి రెండు ఆవులు ఇస్తే ఆరోజు నన్ను ఎగతాళి చేశారు. కుప్పంలో ప్రస్తుతం 4లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి... 10లక్షల లీటర్లకు చేరేలా చూస్తాం. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమను మరింత ప్రోత్సహిస్తాం. తేనె ఉత్పత్తి మరింత పెరిగేలా చర్యలు చేపడతాం. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తాం. ఏ కుటుంబంలోనూ పేదరికం ఉండకూడదన్నదే నా ఆశయం. కుప్పం బస్టాండ్‌, డిపో రూపురేఖలు మార్చి.. ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకువస్తాం. మల్లన్న, రాళ్లమణుగూరును మండలాలు చేస్తాం. కుప్పం భవిష్యత్‌లో రైల్వే జంక్షన్‌లా మారే అవకాశముంది. వి.కోట-పలమనేరు రోడ్డును నాలుగులేన్లుగా మార్చాలి. ఫోర్‌ లేన్‌ రోడ్డు వేస్తే బెంగళూరుకు గంటలోనే వెళ్లొచ్చు’’ అని చంద్రబాబు తెలిపారు.

రాజధాని అమరావతికి భారీ విరాళం

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా.. చిత్తూరు జిల్లాలోని డ్వాక్రా మహిళలు, రూ.4.5కోట్లు, మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్టు తరఫున రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు చెక్కును ముఖ్య మంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల ఉదారతను సీఎం అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని