Punjab election 2022: లక్ష ఉద్యోగాలిస్తాం : చన్నీ

కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే పంజాబ్ ప్రజలకు తొలి కేబినెట్‌ సమావేశంలోనే లక్ష ఉద్యోగాలు ప్రకటిస్తామని సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ వెల్లడించారు. ఉచిత విద్య, ఆరోగ్య సేవలు అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు చన్నీ సోమవారం ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు...

Published : 14 Feb 2022 15:20 IST

చండీగఢ్‌: కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే పంజాబ్ ప్రజలకు తొలి కేబినెట్‌ సమావేశంలోనే లక్ష ఉద్యోగాలు ప్రకటిస్తామని సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ వెల్లడించారు. ఉచిత విద్య, ఆరోగ్య సేవలు అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు చన్నీ సోమవారం ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘ప్రజలను సంతోషపరిచేందుకు తప్పుడు వాగ్దానాలు చేయడంపై మాకు నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆచరణీయ వాగ్దానాలు చేసింది. ఉచిత విద్య, ఉచిత వైద్యం, లక్ష ఉద్యోగాలు ఇందులో కొన్ని’ అని రాసుకొచ్చారు. ఆరు నెలల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు.

చామ్‌కౌర్‌ సాహిబ్‌లో రూ.500 కోట్లతో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చన్నీ తెలిపారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ‘ముఖ్యమంత్రిగా ఎన్నికై మూడు నెలలు మాత్రమే అవుతోంది. ఒకవేళ ఐదేళ్లు ఇస్తే.. లక్ష ఉద్యోగాలు మంజూరు చేస్తాన’ని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై విమర్శలు కురిపిస్తూ.. ‘ఆప్ ప్రతిరోజూ అబద్ధాలు చెబుతుంది. వారు ఏ మార్పు గురించి మాట్లాడుతున్నారు? ఈ పార్టీలోని ప్రతి మూడో వ్యక్తి ఏదో ఒక నేరంలో పాలుపంచుకున్నవారే’నని ఆరోపించారు. పంజాబ్‌లో ఈ నెల 20న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

మరోవైపు.. సోమవారం చండీగఢ్‌ నుంచి సీఎం చన్నీ హెలికాప్టర్‌ టేకాఫ్‌కు అనుమతి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ రాకపోకల కారణంగా 'నో-ఫ్లై జోన్' విధించినందున.. చన్నీ హెలికాప్టర్‌ను చండీగఢ్‌లోని రాజేంద్ర పార్క్ నుంచి టేకాఫ్ చేయడానికి అనుమతించలేదు. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు చన్నీ హెలికాప్టర్‌లో హోషియార్‌పూర్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ, అనుమతులు రాలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని