CM Jagan: రైతులకు మంచి చేస్తున్నా విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి: సీఎం జగన్‌

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూ సమస్యను పరిష్కరించామని సీఎం జగన్‌ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన కార్యక్రమంలో చుక్కల భూముల రైతులకు సీఎం హక్కు పత్రాలు పంపిణీ చేశారు.   

Updated : 12 May 2023 13:32 IST

కావలి: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించామని సీఎం జగన్‌ అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన కార్యక్రమంలో చుక్కల భూముల రైతులకు హక్కు పత్రాలను సీఎం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లో భూసర్వే చేయిస్తున్నామని.. 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీని వేగవంతం చేశామని చెప్పారు. రూ.20వేల కోట్ల విలువైన చుక్కల భూములకు సంపూర్ణ హక్కు కల్పిస్తున్నట్లు జగన్‌ వివరించారు.

‘‘17,476 రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటికే 2 వేల గ్రామాలకు సంబంధించి భూసర్వే నుంచి మొదలుపెట్టి హక్కు పత్రాలు అందించే వరకు అన్ని ఏర్పాట్లు చేశాం. సుమారు 7 లక్షలకుపైగా భూహక్కు పత్రాలను అన్ని రకాలుగా అప్‌డేట్‌ చేసి రైతులకు అందించాం. గ్రామాల్లోని భూములకు సరిహద్దు రాళ్లు పాతించాం. ఈ 2వేల గ్రామాలకు సంబంధించి ఈ నెల 20వ తేదీలోగా అన్ని పనులు పూర్తి చేస్తాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి 2వేల గ్రామాల చొప్పున భూహక్కు పత్రాలు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశాం.

ప్రతి అడుగులో కూడా రైతులకు మంచి జరగాలనే ఆలోచనతోనే ఇవన్నీ చేస్తున్నాం. రైతన్నకు తోడుగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నుంచి మొదలుపెడితే అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆర్‌బీకేల పరిధిలోనే ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 21రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నాం. రైతన్నల మనసు, వారి కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ నాలుగేళ్లలో రైతులకు అండగా ఉండేందుకే ప్రతి అడుగు వేశాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్నదాతలకు మంచి చేస్తున్నాం.

ప్రతిపక్ష నేతల నాటకాలు నమ్మొద్దు..

రాష్ట్రంలోని రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. అన్ని గ్రామాల్లో సర్వే చేసి సహరిద్దు రాళ్లు వేస్తున్నాం. లంచాల ప్రస్తావన లేకుండానే మీ ఖాతాల్లో నగదు పడుతోంది. ఇవాళ 97,471 మంది రైతుల కుటుంబాలకు మేలు చేశాం. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22-ఎ తొలగించాం. రికార్డుల్లో మార్పు చేశాం. మాది రైతు ప్రభుత్వం.. వారికి మంచి చేయడమే మా విధానం. భవిష్యత్తులో వివాదాలు రాకుండా భూహక్కు పత్రాలు ఇస్తున్నాం. ప్రతిపక్ష నేతల నాటకాలు నమ్మొద్దని రైతులను కోరుతున్నా’’ అని జగన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని