Cm Jagan: కేంద్రంతో మా బంధం.. రాజకీయాలకు అతీతం: సీఎం జగన్‌

విభజన గాయాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునర్‌నిర్మాణానికి ఉపయోగపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు.

Updated : 12 Nov 2022 14:08 IST

విశాఖ: విభజన గాయాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదని సీఎం జగన్‌ అన్నారు.  కేంద్రం సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునర్‌నిర్మాణానికి ఉపయోగపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించి బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
జగన్‌ మాట్లాడుతూ.. ‘‘విశాఖపట్నంలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం జనసంద్రాన్ని తలపిస్తోంది. జన కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఉత్తరాంధ్ర జనం ప్రభంజనం మాదిరిగా కదిలివచ్చింది. ఇవాళ దాదాపు రూ.10వేల కోట్లు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు ప్రధానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత రాష్ట్రంలో మా ప్రాధాన్యత. ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదు. పెద్ద మనస్సుతో మీరు చూపే ప్రేమ ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి రైల్వే జోన్‌ వరకు పలు అంశాలపై విజ్ఞప్తి చేశాం. ఏపీకి సహాయ సహకారాలు అందించాలి’’ అని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. 

త్వరలో ఏపీకి ‘వందేభారత్‌’..

‘‘ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌లో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ 8 ఏళ్లలో రైల్వే రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. భారతీయ రైల్వేలోని రైళ్లు, ప్లాట్‌ఫాంలు, సౌకర్యాల కల్పన మరింత పెరిగింది. రూ.446 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆధునికీకరిస్తాం. గత 8 ఏళ్లలో రైల్వే అభివృద్ధి పథంలో నడుస్తోంది. అన్ని రైల్వే స్టేషన్లలో ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పిస్తున్నాం. 2014కు ముందు ఏపీకి రూ.986 కోట్లే వచ్చాయి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రూ.7,032 కోట్లు వచ్చాయి. మోదీ నాయకత్వంలో వందేభారత్‌ రైలు కల సాకారమైంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు కూడా వందేభారత్‌ రైలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు