CM Jagan: పరిపాలనా వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నా: సీఎం జగన్‌

వికేంద్రీకరణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ వేదికగా తన అభిప్రాయాన్ని మరోమారు స్పష్టం చేశారు. రాజధానిపై హైకోర్టు తీర్పు, 3 రాజధానుల అంశంపై జగన్‌ సుదీర్ఘ ప్రసంగం చేశారు...

Updated : 24 Mar 2022 20:18 IST

అమరావతి: వికేంద్రీకరణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ వేదికగా తన అభిప్రాయాన్ని మరోమారు స్పష్టం చేశారు. రాజధానిపై హైకోర్టు తీర్పు, 3 రాజధానుల అంశంపై జగన్‌ సుదీర్ఘ ప్రసంగం చేశారు.

‘‘రాజ్యాంగంలో ఎవరెవరి పరిధి ఏమిటనేది స్పష్టంగా వివరించారు. ఇందులో న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ మూడు పిల్లర్లు. ఏ వ్యవస్థ అయినా తమ పరిధిలో పనిచేస్తేనే.. మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయి. లేదంటే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయి.  మంచి చట్టాలు చేయకపోతే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. మంచి చట్టాలను తీసుకొస్తే ప్రజలు మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు? నచ్చకపోతే తిరస్కరిస్తారు. అసలు చట్టాన్నే వెనక్కి తీసుకున్నాం. అయినా, దానిపై తీర్పు ఇవ్వడం ఏంటి? చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉంటుంది. నెలరోజుల్లో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి రోడ్లు, డ్రైన్లు, విద్యుత్‌ సదుపాయాలు కల్పించాలి. రూ.లక్ష కోట్లు వెచ్చించి అభివృధ్ధి చేయాలని కోర్టు సమయం నిర్దేశించడం కరెక్టు కాదు. ప్రజా ప్రభుత్వంగా బాధ్యతగా కొన్ని విషయాలు స్పష్టం చేస్తున్నా. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్లే  రాష్ట్ర విభజన ఉద్యమం వచ్చిందని, వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది. 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా ఇదే విషయం చెప్పాం. అభివృద్ధి వికేంద్రీకరణకే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’

‘‘రాష్ట్ర రాజధాని, సీఆర్‌డీఏ చట్టానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తోంది. హైకోర్టు తీర్పు చూస్తే రాజ్యాంగ పరంగానే కాకుండా రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను కూడా ప్రశ్నించే విధంగా తీర్పు ఉందనే విషయం పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, ఇటీవల రాష్ట్ర హైకోర్టు తన పరిధిని దాటినట్టు మనందరి మనోభావాల్లో అనిపించింది. అందుకే ఇవాళ చట్ట సభలో దీనిపై చర్చించాల్సి వచ్చింది. రాజధాని ఎక్కడ ఉండాలన్న నిర్ణయంతో పాటు పరిపాలనా వికేంద్రీకరణపై రాష్ట్ర శాసనసభకు ఎలాంటి అధికారం లేదంటూ తీర్పు ఇచ్చింది. 2014 నాటి రాష్ట్ర పునర్‌విభజన చట్టం ప్రకారం ఆ నిర్ణయాధికారాలన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయి తప్ప.. ఈ విషయంలో రాష్ట్ర శాసనసభకు  ఏ అధికారం లేదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. ఆ మేరకు రాష్ట్ర రాజధానితో పాటు పరిపాలనా వికేంద్రీకరణపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదని కూడా చెప్పింది. హైకోర్టు తీర్పును ఒక్క సారి పరిశీలిస్తే దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాసనసభ అధికారాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. రాష్ట్ర శాసనసభ అధికారాలను హరించేలా తీర్పు ఉంది’’

‘‘నిజానికి రాజ్యాంగం ప్రకారం చూసినా.. ఈ నిర్ణయంలో కేంద్రం పాత్ర ఉండదు. కేంద్రం తన పాత్ర ఉంటుందని, అది తన అధికారమని కూడా కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు. ఏ కోర్టులో కూడా కేంద్రం ఈ విధంగా వాదించలేదు. ఇది సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమే నంటూ కూడా ఆర్టికల్‌ 3ని కోట్‌ చేస్తూ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే హైకోర్టుకు నివేదించింది. ఈమేరకు అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది. ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర రాజధాని విషయంలో పార్లమెంట్‌లో  తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానమిచ్చింది. రాజధాని ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్రలేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని కేంద్రం చెప్పింది’’ అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.

రాజధానిని నిర్ణయించేంది రాష్ట్ర ప్రభుత్వమేనని కేంద్రం చెప్పింది

‘‘హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని ఉండాలి అన్న వాదనను కూడా కొట్టిపారేస్తూ అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. రాజధానితో పాటు పరిపాలనా వికేంద్రీకరణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారంలేదని హైకోర్టు తీర్పులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని ఎంపిక చేసే అధికారం లేదని చెబుతుంటే హైకోర్టు చెబుతుంటే, కేంద్రమేమో రాష్ట్రానికే ఆ అధికారం ఉందని స్పష్టం చేస్తోంది.  హైకోర్టు అలా చెప్పటం ఎంతవరకూ సబబు. హైకోర్టు అధికారాలను అగౌరవ పరచడానికి ఈ సభ నిర్వహించడం లేదు. హైకోర్టు అంటే మాకు అత్యంత గౌరవం ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి ఉన్న అధికారాలను కాపాడుకోవాలన్న బాధ్యత లెజిస్లేచర్‌పై ఉందన్నది మా వాదన. ఇది మనతో ఆగిపోయేది కాదు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రజలు ఎన్నుకుంటేనే మనం ఇక్కడికి వచ్చాం. గౌరవాన్ని, ఈ అధికారాలను మనం కాపాడుకోలేకపోతే, మనం ప్రశ్నించకపోతే ఇక ఆ తర్వాత లెజిస్లేచర్‌ అన్న దానికి అర్ధం లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాలు చేస్తుందా? లెజిస్లేచర్‌ చట్టాలు చేస్తుందా? అనేది పెద్ద ప్రశ్నగా చరిత్రలో మిగిలిపోతుంది... ఇవాళ ఈ చర్చ జరగకపోతే, ఏ వ్యవస్థ కూడా తన పరిధి దాటకుండా ఇతర వ్యవస్థలను గౌరవిస్తూ, అధికారాలకు లోబడి పనిచేయాలని రాజ్యాంగంలో పొందుపర్చారు. రాజధాని వికేంద్రీకరణ విషయంలో గౌరవ చట్టసభకు అందుకు సంబంధించిన తీర్మానం కూడా చేసే అధికారం కూడా లేదని హైకోర్టు చెప్పింది. గౌరవ న్యాయస్థానం తన పరిధి దాటి వ్యవస్థలో కీలకమైన శాసన వ్యవహారాల్లోకి ప్రవేశించడం అవాంఛనీయమైన సంఘర్షణే అని తెలియజేస్తున్నా. రాజధానితో పాటు ఈ ప్రాంతంలో నిర్మాణాలన్నింటీని.. ఒక నెలలోపు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు, ఆరు నెలల్లో మిగతా నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని కోర్టు తీర్పులో ఆదేశాలిచ్చారు. ఇది.. సాధ్యపడుతుందా అని ఆలోచించమని కోరుతున్నా. ఆచరణకు సాధ్యం కాని విధంగా తీర్పులు ఉండకూడదని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది’’.

అమరావతి నిర్మాణానికి 40ఏళ్లు పడుతుంది

‘‘రాజధాని నగరంతో పాటు ఈ ప్రాంతంలో చూపిన మాస్టర్‌ ప్లాన్‌ అంతా గ్రాఫిక్స్‌ రూపంలోనే ఉన్నాయి. మాస్టర్‌ ప్లాన్‌ను అప్పటి ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో నోటిఫై చేసింది. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం ఆ మాస్టర్‌ ప్లాన్‌ కాల పరిమితి 20 ఏళ్లు కాగా,  ప్రతి ఐదేళ్లకు ఒకసారి దాన్ని సమీక్షించాల్సి ఉందని పేర్కొన్నారు. 20 ఏళ్లయినా ఇది సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షించాలని రాశారు. ఆరేళ్ల క్రితం రూపొందించి కేవలం గ్రాఫిక్స్‌కే పరిమితమైన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం.. బేసిక్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లేని ఈ ప్రాంతంలో బేసిక్‌ ఫెసిలిటీస్‌ కోసమే వాళ్లు వేసిన అంచనా లక్షా 9వేల కోట్ల రూపాయలు. ఈ పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం కోసం కనీసం 40 ఏళ్లు పడుతుంది. చంద్రబాబు 3ఏళ్లలో రాజధాని కోసం ఖర్చు చేసింది కేవలం రూ.5వేల కోట్లు. సాధ్యపడితే మేం ఎందుకు చేయం?. చంద్రబాబుకు ఈ ప్రాంతంమీద ప్రేమ లేదు. అభిమానం ఉంటే విజయవాడ లేదా గుంటూరులోనే రాజధాని పెట్టేవారు. ఎందుకంటే అక్కడ బేసిక్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఉంది. అమరావతిలో బేసిక్‌ ఇన్‌ఫ్రా స్టక్చర్‌కు రూ.1.09లక్షల కోట్లు ఖర్చవుతుందని వారే లెక్కగట్టారు’’

‘‘అమరావతి ప్రాంతంపై నాకు ప్రేమ ఉంది. అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకున్నా. భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యక్తి నేత కాలేరు. విజన్‌ ఉంటేనే నాయకుడు అవుతారు. అందుకే వీటన్నింటిపై న్యాయ సలహా తీసుకుంటున్నా, ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకురావడంతో పాటు రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కూడా కాపాడుతాం. వారికి కూడా అండగా నిలుస్తాం. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయం. ఎందుకంటే వికేంద్రీకరణకు అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ధి. అందరి ఆత్మగౌరవం అందులో ఉంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా  అదే సరైన మార్గం. అందరికీ మంచి చేసేందుకు మన ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో సర్వాధికారాలతో పాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. వికేంద్రీకరణ బాటలో సాగటం మినహా మరో మార్గం లేదని సవినయంగా తెలియజేస్తున్నా. న్యాయవ్యవస్థపై తిరుగులేని అచంచలమైన విశ్వాసాన్ని మరొక్కసారి ప్రకటిస్తూ డీసెంట్రలైజేషన్‌ పాలసీ, డెసిషన్‌ ఆన్‌ ది క్యాపిటల్‌ రైట్‌ అండ్‌ రెస్పాన్స్‌బిలిటీ అని తెలియజేస్తూ... దేవుడిదయ, ప్రజలందరి దీవెనలు కలకాలం ఉండాలని కోరుకుంటున్నా’’ అని సీఎం జగన్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని