CM Jagan: ఆ స్కూల్స్‌ నుంచే పదోతరగతి పేపర్ల లీక్‌: సీఎం జగన్‌

రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేసేందుకే పదో తరగతి పేపర్లు లీక్‌ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Updated : 05 May 2022 16:31 IST

తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేసేందుకే పదో తరగతి పేపర్లు లీక్‌ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నారాయణ, శ్రీచైతన్య స్కూల్స్‌ నుంచే పేపర్ల లీకులు అయ్యాయని చెప్పారు. తిరుపతిలో ‘జగనన్న విద్యాదీవెన’ నిధులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వాలేవీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని.. ఇప్పుడు తాము ఇస్తున్నామని చెప్పారు. ఇవన్నీ తట్టుకోలేకే తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  

మంచి పేరొస్తుందని తట్టుకోలేకే..

‘‘పదో తరగతి పరీక్షల పేపర్లను వాళ్లంతట వాళ్లే లీక్‌ చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణకు చెందిన రెండు నారాయణ స్కూల్స్‌.. మూడు చైతన్య స్కూల్స్‌ నుంచే ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయి. లీక్‌ చేసిన పేపర్లను వాట్సాప్‌ల్లో పెట్టి ఒక వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దొంగే దొంగ అన్నట్లు వాళ్ల వ్యవహారశైలి ఉంది. జగనన్న విద్యాదీవెనతో ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని కుళ్లు, కుతంత్రాలతో వాళ్లు ఏ స్థాయికి పోతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. 

ఆ అత్యాచారాలు చేసింది తెదేపా నేతలే..

విజయవాడతో పాటు గుంటూరు జిల్లాలో జరిగిన అత్యాచారాలపై నానా యాగీ చేశారు. విశాఖపట్నంలో ఏదేదో జరిగిపోతోందంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ మూడు ఘటనల్లో మహిళల, బాలికలపై దాడికి యత్నించిన, అత్యాచారం చేసిన దుర్మార్గులు తెదేపా నేతలే. ఇలాంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఏడుకొండల వాడిని మనం కోరగలిగేది కేవలం ఒక్కటే. రెండు నాలుకలు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుంచి రక్షించు దేవా అని ప్రార్థిస్తున్నాం’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని