Updated : 23 Sep 2022 14:37 IST

CM Jagan: చంద్రబాబు హైదరాబాద్‌కు లోకల్‌.. కుప్పంకు నాన్‌లోకల్‌..: సీఎం జగన్‌

కుప్పం: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళల జీవితాల్లో ఎంతో మార్పు కనిపిస్తోందని.. అమ్మఒడి ద్వారా అక్కాచెల్లెళ్లకు తోడుగా నిలబడ్డామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. 45-60 మధ్య వయసు మహిళలకు రూ.18,750 చొప్పున సాయాన్ని విడుదల చేశారు. మొత్తంగా 26.39 లక్షల మందికి రూ.4,949 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో వేశారు. ఈ పథకం ద్వారా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందనుంది.

నిధుల విడుదల అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘నాలుగు పథకాల ద్వారా రాష్ట్రంలోని మహిళలకు రూ.51వేల కోట్లు ఇచ్చాం. ఈ మూడేళ్లలో మహిళలకు రూ.1.17 లక్షల కోట్లు అందించాం. వచ్చే ఏడాది జనవరి నుంచి పింఛన్‌ను రూ.2,750కి పెంచుతున్నాం. మాది మహిళల ప్రభుత్వం. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యాకానుక, జగనన్న తోడు పథకాల ద్వారా సాయం అందిస్తున్నాం. నాన్‌ డీబీటీ ద్వారా మూడేళ్ల కాలంలో రూ.1.46 లక్షల కోట్లు అందించాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 31 లక్షల ఇళ్లు పూర్తయితే ప్రతి మహిళ చేతిలో రూ.10 లక్షలు ఉన్నట్లే. పథకాల అమలులో ఎక్కడా లంచాలు లేవు.. మధ్యవర్తులు లేరు.. వివక్ష లేదు. నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఆ సాయం వెళ్తోంది. గత ప్రభుత్వాలకు, మాకు ప్రజలు తేడా గమనించాలని కోరుతున్నా. ఇంతకుముందు పరిపాలనలో ఒక సీఎం ఉండేవారు. అప్పుడు ఆయన చేసిన అప్పులతో పోల్చితే ఇప్పుడు మన ప్రభుత్వం చేసే అప్పులు ఎక్కువేం కాదు. అయినప్పటికీ అప్పుడు జరగని సంక్షేమం ఇప్పుడు ఎందుకు.. ఎలా జరుగుతోందనే విషయాలపై ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలి’’ అని సీఎం జగన్‌ కోరారు.

కుప్పం అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు..

‘‘దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇవే గత ప్రభుత్వ నినాదాలు. కుప్పంలోని ఎస్సీ, బీసీ మహిళల జీవితాల్లో మార్పు వచ్చింది. మహిళా సాధికారతే లక్ష్యంగా 39 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. చంద్రబాబు హైదరాబాద్‌కు లోకల్‌.. కుప్పంకు నాన్‌లోకల్‌.. కుప్పం అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు. కరవు సమస్యకు హంద్రీనీవా పరిష్కారమని తెలిసినా పూర్తి చేయలేదు. ఎన్ని సార్లు సీఎం అయినా కుప్పం నియోజకవర్గంలో రోడ్లు వేయలేదు. ఉపాధి కోసం వేల మంది యువకులు వలసపోతున్నారు. మరో 6 నెలల్లో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ నిర్మాణాలు పూర్తి చేస్తాం. కుప్పంను మున్సిపాలిటీ చేసింది మా ప్రభుత్వమే. యామిగానిపల్లె, మదనపల్లె వద్ద రూ.250 కోట్లతో జలాశయాలు నిర్మిస్తున్నాం. పాలారు ప్రాజెక్టు పూర్తికి రూ.120 కోట్లు ఖర్చు చేస్తాం. కుప్పంలోని 4 మండలాల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తా’’ అని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని