CM Jagan: పనితీరు మార్చుకోండి.. 32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ వార్నింగ్‌

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికను సీఎం జగన్‌ వెల్లడించారు. 32 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని, పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

Updated : 16 Dec 2022 16:09 IST

అమరావతి: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహణలో  32 మంది ఎమ్మెల్యేలు వెనకబడ్డారని సీఎం జగన్‌ వెల్లడించారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 11వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నియోజకవర్గ సమన్వయకర్త గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని.. వారి సమస్యలను పరిష్కరించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం అమలు తీరు ఎలా ఉందనేదానిపై ప్రతి 3 నెలలకోసారి సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమం ఆశించిన రీతిలో జరగట్లేదని భావించిన సీఎం జగన్‌.. నిఘావిభాగం ద్వారా ప్రజాప్రతినిధుల పనితీరుపై సర్వే నిర్వహించారు. తాజాగా అందిన సర్వే నివేదికను సీఎం జగన్‌ ఇవాళ వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం 32 మంది ఎమ్మెల్యేలు వెనకబడినట్లు వెల్లడించి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చిలో మరోసారి గడపగడపకు మన ప్రభుత్వంపై సమీక్షించనున్నట్లు సీఎం తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని