CM Kcr: ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిది: కేసీఆర్‌

దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Updated : 20 Feb 2022 17:02 IST

ముంబయి: దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఆదివారం ముంబయి వచ్చిన సీఎం కేసీఆర్‌... జాతీయ రాజకీయాలపై ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చించారు. అనంతరం ఇద్దరు సీఎంలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించినట్టు చెప్పారు. ఇంకా అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. దేశంలో అనేక మార్పులు రావాల్సి ఉందన్నారు. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధనాలపై ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చించినట్టు వివరించారు. కేంద్ర సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తుందన్న సీఎం కేసీఆర్‌... వైఖరి మార్చుకోకుంటే భాజపాకు ఇబ్బందులు తప్పవన్నారు.

‘‘తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల మధ్య వెయ్యి కి.మీ మేర ఉమ్మడి సరిహద్దు ఉంది. రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరముంది. ఉద్ధవ్‌ ఠాక్రేను హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించా’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ... ‘‘ఈ చర్చలు ఆరంభమే మున్ముందు పురోగతి లభిస్తుంది. మా చర్చల్లో రహస్యమేమీ ఉండదు. దేశంలో మార్పు కోసం ఏం చేసినా బహిరంగంగానే చేస్తాం. దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయం నడుస్తోంది. ప్రతీకార రాజకీయాలు దేశానికి మంచిది కాదు. సోదర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ కలిసి నడుస్తాయి. సీఎం కేసీఆర్‌ వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్‌, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని