Cm Kcr: రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం.. ఎకరాకు రూ.10వేలు పరిహారం: సీఎం కేసీఆర్

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేల ఏకరాల్లో పంట నష్టపోయింది. ఖమ్మం పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ నష్టపోయిన రైతులతో మాట్లాడారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

Updated : 23 Mar 2023 17:06 IST

ఖమ్మం: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు చొప్పున పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు. పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక పంపబోమని తేల్చి చెప్పారు. ఇంతకుముందు పంపిన వాటికే మోదీ సర్కారు ఎలాంటి పరిహారం పంపలేదని సీఎం అన్నారు.

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేల ఏకరాల్లో పంట నష్టపోయిన విషయం తెలిసిందే. వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. మొదటగా ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి రూ.50వేలు ఇవ్వాలని రైతులు ఈ సందర్భంగా సీఎంను కోరారు.

పంట పరిశీలన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 2,28,255 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8,865 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. కొత్త ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు అనుకూలమైన పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల ద్వారా వ్యవసాయం నిలదొక్కుకునే పరిస్థితి వచ్చింది. రైతులు అప్పుల ఊబిలో నుంచి తేరుకుంటున్నారు. మూర్ఖులైన కొందరు ఆర్థికవేత్తలు వ్యవసాయం దండగ అంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువే. అద్భుతమైన వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. ఇప్పుడున్న కేంద్రం విధానం ప్రకారం నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం రాదు. దేశంలో రైతులకు ఉపయోగపడే పాలసీలు లేవు. దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ అవసరం’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

అకాల వర్షానికి దాదాపు అన్ని జిల్లాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.  కరీంగనర్‌ జిల్లా రామడుగులో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘చాలా మంది రైతులు వందశాతం పంట నష్టపోయారు. సమైక్య రాష్ట్రంలో చొప్పదండి ప్రాంతం ఎడారిగా ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా ప్రాంతాలకు వేసవిలోనూ నీళ్లు వస్తున్నాయి. గతంలో ఎన్నిసార్లు అడిగినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి రూ.10వేల చొప్పున సాయం చేస్తాం. పంట పరిహారం గురించి కేంద్రాన్ని కూడా అడిగేది లేదు. పూర్తిగా రాష్ట్రప్రభుత్వ నిధులతో రైతులను ఆదుకుంటాం.’’ అని కేసీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని