CM KCR: ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు?: కేసీఆర్‌

ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో పడవద్దు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్ర ధాన్యం కొనాలని తెలంగాణ నుంచి సుమారు 2వేల కి.మీ. వచ్చి దీక్ష చేస్తున్నామని చెప్పారు. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి

Updated : 11 Apr 2022 15:14 IST

దిల్లీ: ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో పడవద్దు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనాలని తెలంగాణ నుంచి సుమారు 2వేల కి.మీ. వచ్చి దీక్ష చేస్తున్నామని చెప్పారు. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని కేసీఆర్‌ తెలిపారు. కేంద్ర మంత్రి తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవన్నారు. తెలంగాణలో పండించే ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలని దిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెరాస దీక్ష చేపట్టింది. సీఎం కేసీఆర్‌తో పాటు ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన రైతు నేత టికాయత్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గోయల్‌ ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారు?

‘‘పీయూష్‌ గోయల్‌ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారు. మేము పీయూష్‌ గోయల్‌ వద్ద అడుక్కోవడానికి వచ్చామా? గోయల్‌ మీరు ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారు? ఆయన పీయూష్‌ గోయల్‌ కాదు.. పీయూష్‌ గోల్‌మాల్‌. దేశ వ్యాప్తంగా ఎక్కడా లేనంతగా 30లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయి. మోటార్‌, విద్యుత్‌ తీగలు, బోర్ల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఆరు దశాబ్దాల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడాం. రాష్ట్ర సాధనలో వందలాది మంది యువత బలిదానాలు చేసింది. ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చింది. రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చాం. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. టికాయత్‌ను ఎన్ని విధాలుగా అవమానించారో చూశాం. టికాయత్‌ దేశద్రోహి అన్నారు, ఉగ్రవాది అన్నారు. రైతుల కోసం అవమానాలును భరిస్తూనే ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్రజానీకం టికాయత్‌ వెంట ఉంటుంది.

ఏ ఉద్దేశంతో హైదరాబాద్‌లో భాజపా నేతలు ధర్నా చేస్తున్నారు?

ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లో విద్యుత్‌ కోసం రైతుల ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణలో కోటి ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. కేంద్రం పంట మార్పిడి చేయమందని మేము రైతులకు చెప్పాం. రైతులు ధాన్యం పండించండి.. మేము కొంటామని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర భాజపా నేతలు సైతం రైతులను రెచ్చగొట్టారు. మేము దిల్లీలో ధర్నా చేస్తే.. పోటీగా భాజపా నేతలు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో నేతలు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారు. రైతుల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం. పీయూష్‌ వ్యాఖ్యలను గుర్తుపెట్టుకుంటాం. మా మంత్రులు ఏమైనా పనిపాట లేక పీయూష్‌ వద్దకు వెళ్లారా? మా మంత్రులను పీయూష్‌ ఎలా అవమానిస్తారు? కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారు. దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు. అంతిమ విజయం సాధించే వరకు విశ్రమించేది లేదు.

మోదీ, గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా..

భాజపా నిస్సిగ్గుగా వ్యహహరిస్తోంది. హిట్లర్‌, నెపోలియన్‌ వంటి అహంకారులు కాలగర్భంలో కలసిపోయారు. కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేస్తారు. భాజపాలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? నన్ను జైలుకు పంపుతామని రాష్ట్ర భాజపా నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా? దమ్ముంటే రండి. ధాన్యం కొనుగోలు కోసం దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ఒకే విధానం లేకపోతే రైతులు రహదారులపైకి వస్తారు. బోర్లకు మీటర్లు పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మోదీ, పీయూష్‌ గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నా’’ అని కేసీఆర్‌ అన్నారు.

రూ.6వేలతో రైతులను ఉద్ధరిస్తున్నట్లు కేంద్రం మాట్లాడుతోంది: టికాయత్‌

ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోందని.. ఒక రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలో పోరాడటం కేంద్రానికి సిగ్గుచేటని రాకేశ్ టికాయత్‌ అన్నారు. ‘‘ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. కేంద్రం విధానాలతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రైతుల కోసం కేసీఆర్‌ ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ సీఎం చేస్తున్నది రాజకీయ ఉద్యమం కాదు. రైతుల కోసం మమతా బెనర్జీ కూడా ఆందోళన చేస్తున్నారు. విపక్ష సీఎంలు ఏకమై దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. రైతుల పక్షాన కేసీఆర్‌ చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. రైతుల కోసం పోరాటం ఎవరు చేసినా వారికి మద్దతు ఉంటుంది. సాగు చట్టాల రద్దు కోసం దిల్లీలో 13నెలల పాటు ఉద్యమించాం. కేంద్రం ఏడాదికి మూడు విడతలుగా రైతులకు రూ.6వేలు ఇస్తోంది. రూ.6వేలతో రైతులను ఉద్ధరిస్తున్నట్లు కేంద్రం మాట్లాడుతోంది. తెలంగాణలో రైతుల కోసం 24గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. రైతుల కోసం కొట్లాడండి.. మేము మీ వెంట ఉంటాం. రైతుల కోసం ఉద్యమించేందుకు తెలంగాణకు కూడా వస్తాం. కనీస మద్దతు ధరపై ఏర్పాటైన కమిటీతో చర్చలు జరిపాం. కాల వ్యవధిపై స్పష్టత ఇచ్చేందుకు ఆ కమిటీ నిరాకరించింది. రైతుల కోసం తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు గొప్పవి. తెలంగాణలో అందిస్తున్న ఉచిత విద్యుత్‌ దేశమంతా అమలు చేయాలి. మేము చేస్తున్నవి ఓట్ల దీక్షలు కావు’’ అని టికాయత్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని