CM KCR: భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్‌ ‘ఆత్మీయ సందేశం’

భారత్‌ రాష్ట్ర సమితి శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆత్మీయ సందేశాన్నిచ్చారు. అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో దేశం కోసం ముందుకు పోదామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

Updated : 20 Mar 2023 20:06 IST

హైదరాబాద్‌: ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే బాగుంటే సరిపోదని.. దేశం మొత్తం బాగుండాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో దేశం కోసం ముందుకు పోదామని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) నేతలకు సీఎం కేసీఆర్‌ ఆత్మీయ సందేశాన్ని ఇచ్చారు.

అజేయమైన శక్తిగా భారాస

‘‘అన్నం తినో అటుకులు తినో.. ఉపవాసం ఉండో 14ఏళ్లు పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని.. లాఠీలకు, జైళ్లకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత గులాబీ సైనికులకే దక్కుతుంది. ప్రజల ఆశీర్వాదం, నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి రెండు సార్లు భారాస అధికార పగ్గాలు చేపట్టింది. పట్టుదల, అంకితభావంతో పనిచేస్తూ కార్యకర్తల బలంతోనే 60లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా భారాస ఎదిగింది. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యంకాని ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులను తిరగరాసి 21ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని.. ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను అందుకుంది. 

ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్స్‌.. భారాసకు మాత్రం టాస్క్‌

కష్ట సుఖాల్లో కలిసి నడుస్తూ.. పల్లెల్లో, గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి కొండంత అండగా నిలిచిన కార్యకర్తల రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను. ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్స్‌.. భారాసకు మాత్రం టాస్క్. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవెర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్తపంథాలో నడుస్తూ కోటి కాంతులు విరజిమ్మే నేలగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నాం. కష్టాలు, కన్నీళ్లు, కరవులతో అల్లాడిన తెలంగాణ ఇవాళ పచ్చని పంటలతో చిరునవ్వులతో కళకళలాడుతుంది. ఆగమైపోయిన తెలంగాణ నేడు కుదుటపడింది, కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోతుంది. ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది’’ అని కేసీఆర్‌ తెలిపారు.

దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలి..

‘‘వనరులు, వసతులు ఉండి కూడా భారతదేశం భంగపడుతోంది. చైనా, సింగపూర్, దక్షిణ కొరియా లాంటి దేశాలు అద్భుతమైన ప్రగతి సాధిస్తుంటే మనం ఇంకా కుల, మత కుమ్ములాటల్లో మునిగిపోయి ముందడుగు వేయలేకపోతున్నాం. రాష్ట్రం బాగుంటే సరిపోదు, దేశం కూడా బాగుండాలి. దేశానికి కొత్త అజెండాను నిర్దేశించి, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత రాష్ట్ర సమితిగా మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టాం. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్‌ నినాదాన్ని ఎత్తుకొని దేశం కోసం బయల్దేరిన పార్టీపై కేంద్రంలోని భాజపా దాడులు చేస్తూ.. తెలంగాణ ప్రగతికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. వేల దాడులు, లక్షల కుట్రలను ఛేదించి గెలిచిన పార్టీ భారాస. సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో.. పార్టీ శ్రేణులే నా బలం,  వారే నా బలగం. చిల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ భారాస ఆదరించబోదు. ఎన్నికల ఏడాదిలో నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికిమాలిన పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలి. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత శ్రేణులపైనే ఉంది. ఎన్నటికైనా ధర్మమే జయిస్తుంది’’ అని కేసీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని