CM Kcr: కేంద్ర మంత్రులు ఇక్కడ విమర్శిస్తున్నారు.. దిల్లీలో అవార్డులిస్తున్నారు: సీఎం కేసీఆర్‌

రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి తిడుతున్నారని.. అలా తిట్టిన వారే దిల్లీలో రాష్ట్రానికి అవార్డులు ప్రకటిస్తున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. అయితే, రాజకీయాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు విమర్శలు చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు.

Updated : 01 Oct 2022 16:42 IST

హనుమకొండ: తెలంగాణ ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో ఇవాళ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉందని.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. వరంగల్‌లో ప్రతిమ క్యాన్సర్‌ ఆస్పత్రిని సీఎం కేసీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. 350 పడకల సామర్థ్యంతో ఆస్పత్రిని నిర్మించారు. ప్రతిమ వైద్య కళాశాలలో 150 మెడికల్‌ ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

క్యాన్సర్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి కేసీఆర్‌ను, ఇక్కడి మంత్రులను తిట్టి వెళ్తారు. అలా తిట్టిన వారే దిల్లీలో అవార్డులు ప్రకటిస్తారు. రాజకీయాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు విమర్శిస్తున్నారు. ఉద్యమ సమయంలో నేను ఏదైతే ప్రజలకు పదేపదే చెప్పానో.. అది వందకు వంద శాతం ఈరోజు సాకారం అవుతోంది. చాలా అద్భుతంగా, గొప్ప ధనిక రాష్ట్రంగా ఉంటామని ఉద్యమ సమయంలో చెప్పాను. నేను ఉద్యమం ప్రారంభించినప్పుడు పుట్టిన పిల్లలకు ఇప్పుడు ఫలితాలు అందుతున్నాయి. గతంలో తెలంగాణలో ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు ఐదు మాత్రమే ఉండేవి. ఇప్పుడు రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య 17కు చేరింది. రాష్ట్రంలో 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లు 6500కు పెరిగాయి. వైద్య విద్య కోసం మన విద్యార్థులు ఉక్రెయిన్‌ లాంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

 అద్భుతంగా పనిచేసే యువశక్తి ఉన్నా..

కొన్ని సందర్భాల్లో చిన్న అజాగ్రత్త వల్ల తీవ్రంగా నష్టపోతాం. 1956లో చిన్న ఏమరుపాటు వల్ల 60 ఏళ్లు నష్టపోయాం. ఎన్నో ప్రాణత్యాగాల వల్ల మళ్లీ తెలంగాణ సాధించుకున్నాం. ప్రపంచంలో ఏ దేశానికి లేని అనుకూలతలు భారత్‌కు ఉన్నాయి. అద్భుతమైన వ్యవసాయ అనుకూల వాతావరణం భారత్‌లో ఉంది. దేశవ్యాప్తంగా 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. అత్యధిక పంటలు పండిస్తున్నా.. విదేశీ ఆహార పదార్థాలపై ఆధారపడుతున్నాం. అద్భుతంగా పనిచేసే యువశక్తి ఉన్నా.. వెనకబడి ఉన్నాం. భారతదేశం గొప్ప సహనశీల దేశం. ఐకమత్యంతో ముందుకు వెళ్లాల్సిన ఈ దేశంలో విద్వేషాలకు చోటు ఇవ్వొద్దు. విద్వేష రాజకీయాలను యువత గ్రహించి జాగ్రత్తగా ఉండాలి. మన రాష్ట్ర పురోగమనం అనుకున్న విధంగా సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలి. మేధావులు ముందుండి చైతన్యపరిస్తే సమాజం ముందుకెళ్తుంది’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts