BRS: భారాసకు అధికారమిస్తే.. జలవిధానం పూర్తిగా మార్చేస్తాం: కేసీఆర్‌

భారాసకు అధికారమిస్తే దేశంలో జలవిధానం పూర్తిగా మార్చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈమేరకు నాందేడ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 05 Feb 2023 18:51 IST

నాందేడ్‌: చిన్న చిన్న దేశాలు కూడా అద్భుతంగా ప్రగతి సాధిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే భారాస(BRS) లక్ష్యమని పునరుద్ఘాటించారు. నాందేడ్‌ (Nanded)లో నిర్వహించిన భారాస బహిరంగ సభ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో ప్రజలకు సరిపడా సహజ వనరులు ఉన్నాయి. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల మేర వర్షం కురుస్తోంది. దేశంలో సాగుకోసం 40 వేల టీఎంసీలు సరిపోతాయి. ప్రభుత్వం తలుచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చు.’’ అని కేసీఆర్‌ అన్నారు.

2004లో వేసిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇప్పటి వరకు నీటి వాటాలు తేల్చలేదని కేసీఆర్‌ అన్నారు. ‘‘ఇప్పటికీ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు? సరిపడా జలాలు ఉన్నా.. రాష్ట్రాలు ఎందుకు కొట్టుకుంటున్నాయి? భారీ రిజర్వాయర్ల నిర్మాణం గురించి కేంద్రం ఎందుకు ఆలోచించడం లేదు. దేశ ప్రగతి కోసం అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌ ఆలోచనలు కావాలి. దేశ జలవిధానం పూర్తిగా మారాలి. మన దేశానికి 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం ఉంది. అయినా, అనేక రాష్ట్రాలు విద్యుత్‌ కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో కూడా నీరు, విద్యుత్‌ కొరత ఉంది. దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. న్యూయార్క్‌, లండన్‌లో కరెంట్‌ పోవచ్చుగానీ, హైదరాబాద్‌లో పోదు’’ అని కేసీఆర్‌ అన్నారు.

ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తుల అమ్మకం

స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడిచినా ఎన్నో విషయాల్లో భారత్ వెనకబడి ఉందని కేసీఆర్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నాయకులంతా సమస్యల పరిష్కారం వదిలేసి మాటలతో కాలం గడుపుతున్నారని అన్నారు. భారాసకు అధికారమిస్తే జలవిధానం పూర్తిగా మార్చేస్తామని చెప్పారు. దేశంలో కీలక ప్రాంతాల్లో భారీ నీటి ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. వ్యాపారం ప్రభుత్వ విధానం కాదని మోదీ చెబుతున్నారనీ, ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా విక్రయించారని విమర్శించారు.

బొగ్గు దిగుమతిపై మతలబు ఏంటి?

దేశంలో పుష్కలంగా బొగ్గు లభ్యమవుతుండగా విదేశాల నుంచి ఎందుకు కొనాలని కేసీఆర్‌ ప్రశ్నించారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి వెనకున్న మతలబు ఏంటని అన్నారు. దేశంలో 360 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్న కేసీఆర్‌.. మన దేశ బొగ్గు నిల్వలతో 125 ఏళ్లపాటు దేశమంతటికీ విద్యుత్‌ ఇవ్వొచ్చని చెప్పారు. ‘‘విద్యుత్‌ రంగంలో ప్రైవేటు సంస్థలను కేంద్రం ఎందుకు ప్రోత్సహిస్తోంది భారాస అధికారంలోకి వచ్చాక 90శాతం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి.’’ అని కేసీఆర్‌ అన్నారు.

అదానీ అంతవేగంగా ఎలా ఎదిగారు?

ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ లాభాల్లో కొనసాగుతుండగా, దాన్ని ఎందుకు అమ్ముతున్నారని కేసీఆర్‌ ప్రశ్నించారు. ‘‘అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ భారీగా పెట్టుబడి ఎందుకు పెట్టాల్సి వచ్చింది. సాధారణ వ్యాపారి అయిన అదానీ.. రెండేళ్లలోనే ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎలా ఎదిగారు?ప్రధాని మిత్రుడైన అదానీ అంత వేగంగా ఎలా  డెవలప్‌ అయ్యారు? అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలి. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో సమాధానం చెప్పి తీరాలి.’’ అని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. మహిళ ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుత ప్రగతి సాధిస్తుందన్న కేసీఆర్‌.. భారాస అధికారంలోకి వస్తే చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. చైనా నుంచి వెళ్లిపోతున్న కంపెనీలను భారత్‌ ఎందుకు ఆకర్షించడం లేదని ప్రశ్నించారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని