CM Kcr: జీవో 111 ఎత్తివేయాలని నిర్ణయించాం: సీఎం కేసీఆర్‌

తెలంగాణలో కొత్తగా 6 ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. సంబంధిత మంత్రులే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించినట్లు

Updated : 12 Apr 2022 19:38 IST

హైదరాబాద్: తెలంగాణలో గత కొంతకాలంగా నెలకొన్న ధాన్యం కొనుగోలు వివాదానికి సీఎం కేసీఆర్‌ ముగింపు పలికారు. యాసంగిలో పండిన వడ్లు కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడంతో కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం వెల్లడించారు.  తెలంగాణలో కొత్తగా 6 ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని చెప్పారు. కావేరి అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, ఫార్మా వర్సిటీ, అమిటీ, సీఐఐ, గురునానక్‌, ఎంఎన్‌ఆర్‌ వర్సిటీలకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని వివరించారు. ఫార్మా వర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. సంబంధిత మంత్రులే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించినట్లు సీఎం చెప్పారు. ఈ యూనివర్సిటీల్లో 3,500 పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఆధ్వర్యంలో కామన్‌ బోర్డు ఏర్పాటు చేసి టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తామన్నారు. 

జీవో 111 ఎత్తివేస్తూ మంత్రివర్గం తీర్మానం..

‘‘వికారాబాద్‌ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జీవో 111 ఎత్తివేస్తూ మంత్రివర్గం తీర్మానించింది. న్యాయపరమైన చిక్కులు అధిగమించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తాం. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో దీనిపై ఒక కమిటీ వేశాం. కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మూసీ నది, ఈసా నది, ఆ రెండు జలాశయాలు కలుషితం కాకుండా గ్రీన్‌ జోన్స్‌ డిక్లేర్‌ చేసి .. మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తూ జీవో ఇంప్లిమెంట్‌ చేయాలని ఆదేశాలిచ్చాం. కొద్దిరోజుల్లో సీఎస్‌ నేతృత్వంలో అధికారులు సమావేశమై దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇది ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త. 

యాసంగి ధాన్యం మొత్తం కొంటాం..

యాసంగి ధాన్యంలో వచ్చే 37 శాతం నష్టం కేంద్రమే భరించాలి. అది చేయకుడా రాద్ధాంతం చేస్తున్నారు. మోరీల్లాగా నోరులు పెట్టుకుని పెడ బొబ్బలు పెడుతున్నారు. భారత ప్రజల ముందు ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించాం. అందుకే దిల్లీలో ధర్నా చేశాం. బ్యాంకులను ముంచిన కార్పొరేట్లను కాపాడుతారు. వారు సేఫ్‌ గా లండన్‌లో ఉంటారు. వారిని అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు వెళితే వారిని వెనక్కి పిలిపిస్తారు. బడా కంపెనీలకు రూ.1.50 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. కానీ, తెలంగాణలోని 60 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.3500 కోట్లు ఇవ్వమంటే.. ఇది కూడా కేంద్రం భరించడం లేదు. ఒక్క అదానీ గ్రూప్‌నకే ఇటీవల రూ.12వేల కోట్లు మాఫీ చేశారు. వారిని మాత్రం ఏమీ అనరు. రైతుల కోసం రూ.3,500 కోట్లు ఖర్చు చేయమంటే చేయరు. రైతులను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. రైతాంగాన్ని కాపాడుకోవాలని కేబినెట్‌లో చర్చించాం. ఈ ఏడాది 21లక్షల ఎకరాలలో యాసంగిలో వరి పంట తగ్గింది. యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సీఎస్‌ నేతృత్వంలో ఒక కమిటీ వేశాం. ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో సమర్థమైన ప్రభుత్వం ఉంది. ఒక్క గింజ కూడా రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుంది. క్వింటాలుకు రూ.1960లు చెల్లిస్తాం. ధాన్యం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.

దేశంలో పూర్తి రైతు వ్యతికేక ప్రభుత్వం ఉంది..

పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం కేంద్రంలో ఉండటం భారత రైతాంగం దురదృష్టం. 13 నెలల పాటు లక్షలాది మంది రైతులు దేశ రాజధానిలో ధర్నా చేసిన పరిస్థితి మనం చూశాం. చివరికి ఆ చట్టాలు రద్దు చేసుకుని భారత ప్రధానమంత్రి రైతులకు క్షమాపణ చెప్పారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించాలని ఒక బలమైన కుట్ర కేంద్రం చేస్తోంది. రైతులు వాళ్ల భూములన్నీ కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించాలి, వారి వద్దే జీతగాళ్లుగా పనిచేయాలి. ఆ కుట్రను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయాలని అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరినా చేయలేదు. మేనిఫెస్టోలో పెట్టారు కానీ అమలు చేయలేదు. ఎరువుల ధర పెంచారు. వ్యవసాయ బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయించారు. అలా చేసిన రాష్ట్రాలకు ఎఫ్ఆర్‌బీఎం పరిమితి అరశాంతం పెంచారు.

రైతుల కోసం మరో మహాసంగ్రామం.. టికాయత్‌ చెప్పారు..

రైతుల కోసం మరో మహాసంగ్రామం చేపడతామని రాకేశ్‌ టికాయత్‌ చెప్పారు. త్వరలోనే మొదలు పెడతారు. తెలంగాణలో ధాన్యం కొనమంటే చాలా అవమానపర్చే విధంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. తెలంగాణలో నూకలు తినడం అలవాటు చేయండి అని చెప్పారు. ఎంత గర్వం కేంద్ర మంత్రికి. తెలంగాణకు ఉన్న స్థాయి కేంద్రానికి లేదు. వారి అసమర్థతను ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫుడ్‌ సెక్యూరిటీ బాధ్యతను కేంద్రం విస్మరిస్తోంది. బాయిల్డ్‌ రైసు ఎగమతి చేసి చేయలేదని అబద్ధాలు చెప్పారు.  యాసంగి వడ్లలో నూకల శాతం పెరుగుతుంది.  సాధారణంగా వర్షాకాలంలో క్వింటాల్‌ వడ్లకు 67 కిలోల బియ్యం వస్తాయి. అదే యాసంగిలో 34..35 కిలోలు మాత్రమే వస్తాయి. ఆ నష్టాన్ని కేంద్రం భరించాలి. ఎందుకంటే.. భారతదేశం ఆహార భద్రతను కేంద్రానికి అప్పగించారు. అందుకే ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేశారు. గిడ్డంగుల సామర్థ్యం ఎఫ్‌సీఐకే ఉంటుంది.

రైతుల ప్రతినిధులతో హైదరాబాద్‌లో వర్క్‌షాప్‌...

ఎన్నికలు రాగానే యుద్ధం, సర్జికల్‌ దాడులు అంటూ ప్రజలను భాజపా రెచ్చగొడుతోంది. ఓట్ల కోసం భావోధ్వేగాలను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకల్లో రాళ్ల దాడులు జరిగాయి. భాజపా వైఖరిని ప్రజలు గమనించి తగిన బుద్ధి చెబుతారు. కేంద్రంలోని భాజపాకు అహంకారం పెరిగింది. 13 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో బతుకుతున్నారు. దేశం చిన్నాభిన్నమైతే సంభాళించుకోవడానికి వందేళ్లు పడుతుంది. దేశం అతి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ ఉన్మాదుల చేతిలోపడి  కొట్టుకుపోతే వంద సంవత్సరాలు భారత దేశం వెనక్కి పోతుంది. ఇండియా బుద్ధి జీవుల దేశం. రైతుకు ఇంటిగ్రేటెడ్‌ న్యూ అగ్రికల్చర్‌ పాలసీ ఈ దేశంలో రావాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు భారత రైతాంగానికి చెందిన రైతు ప్రతినిధులతో హైదరాబాద్‌లో వర్క్‌ షాప్‌ నిర్వహిస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.  

రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారు..

కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు ఉంటాయి. మేం వచ్చినప్పటి నుంచి పెట్రోల్‌, డీజిల్‌పై ఏమాత్రం పెంచలేదు.. తగ్గించలేదు. కానీ, కేంద్రం రోజుకు రూపాయి చొప్పున పెంచుతోంది. రాష్ట్రంలో ట్యాక్స్‌ తగ్గించాలని చెబుతున్నారు. మీరు పెంచాలి, మేం తగ్గించాలా? భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు ఏంటంటే.. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు ఉండాలి. ఆర్థికంగా దివాళా తీయాలి రాష్ట్రాలు. వారి చెప్పుచేతల్లో ఉండాలి. ఇది ఫెడరల్‌ సమాఖ్యకు పూర్తి విరుద్ధం. ప్రజాస్వామ్యం పరిణితి పెరిగిన దేశాల్లో సెంట్రల్‌ నుంచి రాష్ట్రాలకు, రాష్ట్రాల నుంచి స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ అవుతాయి. అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాల్సింది పోయి.. రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారు.

పక్కా ప్రణాలికతో కీలక నిర్ణయాలు తీసుకున్నాం..

సమైక్య రాష్ట్రంలో అత్యంత బాధాకరంగా నలిగిపోయి, చితికిపోయిన రంగం వ్యవసాయ రంగం. తెలంగాణ ఏర్పడ్డాక సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం చెల్లాచెదురై ఆకలి చావులు చూశాం. అనేక దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పక్కా ప్రణాలికతో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అనేక ఉద్దీపనలు సమకూర్చడం జరిగింది. మిషన్‌ కాకతీయతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. అందులో భాగంగా కోతలు లేకుండా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్‌ వసతి బాగా పెరిగింది. గొప్ప పంటలకు తెలంగాణ ఆలవాలంగా మారింది. ఆన్‌గోయింగ్‌ పెండింగ్‌ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడం, మిషన్‌ కాకతీయ పూర్తి చేయడం, రీఇంజినీరింగ్‌ చేసి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి వరల్డ్‌ లార్జెస్ట్‌ మల్టీ ఇరిగేషన్‌ స్కీం పూర్తి చేశాం. వాటి ఫలితాలు కూడా అందుతున్నాయి. వీటితో పాటు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సాగుకు పెట్టుబడి ఇస్తున్నాం. సాగు ఖర్చుల కోసం ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నాం. ఎలాంటి పైరవీలు లేకుండా రైతులకు అందిస్తున్నాం. 24 గంటలు ఉచిత విద్యుత్‌, ఉచితంగా నీటి సరఫరా చేస్తున్నాం. గతంలో రైతులు బకాయి ఉన్న రూ.500 కోట్ల నీటి తీరువా రద్దుచేసి, కొత్తగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా ఉచితంగా ఇవ్వడం లేదు. రైతులు చనిపోతే 8 రోజుల్లో రైతు బీమా అందించే విధంగా ఏర్పాటు చేశాం. కరోనా సందర్భంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో 7వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు గ్రామాల్లోనే ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసి మూడు.. నాలుగు రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేశాం’’ అని సీఎం పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని